Tips to Avoid Real Estate Scams in Telangana : ముందుగా కట్టిన ఇల్లు, ఫ్లాట్, విల్లా కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణ నాణ్యతను పరిశీలించాలి. ఎందుకంటే ఇటీవల కొందరు కడుతున్న భవనాల్లో చాలా లోపాలు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కొనుగోలు చేసి ఇంట్లో అడుగుపెట్టగానే మొదటి ఏడాదే ఇంట్లో స్లాబ్ వర్షానికి కారడమో, ఎండాకాలంలో గోడలు బీటలు రావడమో జరుగుతున్నాయి. దీంతో ఇళ్లు కట్టిన, కొన్న ఆనందం ఎంతో కాలం ఉండటం లేదు. వందేళ్లు ఉండాల్సిన భవనం ఇలా అవ్వడం ఏంటని వారిలో వారే ప్రశ్నలు వేసుకుంటున్నారు. అందుకే ఇంటిని నిర్మించే ముందే ఇంజినీర్‌తో నాణ్యత ప్రమాణాలను నిర్ధారించుకోవాలి. లేకపోతే బిల్డర్‌నే నాణ్యత పరీక్షలు చేయాలని చెప్పాలి. ఆ నివేదికను చూపించాలని కోరాలి.
ఇంటి నిర్మాణం, ఎంపికలో నిపుణులు చెప్పిన జాగ్రత్తలు :
- ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఏ ప్రాంతంలో కడుతున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ ఇంటి నిర్మాణానికి భూమిని కొనుగోలు చేస్తే లోతట్టు ప్రాంతాలు, చెరువులు, శిఖం భూములు ఉన్న చోట అసలు చేయవద్దు. ఒకవేళ కొంటే భారీ వర్షాలు సంభవించినప్పుడు మునిగిపోయే ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ఆ ఇంటిని అమ్ముకోవాల్సి వస్తుంది.
- ముఖ్యంగా ఇంకోవిషయం ఏంటంటే ఈ రంగంలోకి అనుభవం లేనివాళ్లు కూడా వస్తున్నారు. వారు కస్టమర్ డబ్బులతో ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే వారు అంతకు ముందు ఏయే ప్రాజెక్టులు చేశారు? సమయానికి అందజేశారా, నాణ్యంగా కట్టారా అనే విషయాలను తెలుసుకొని తర్వాత బుక్ చేసుకోవాలి.
- తక్కువ ధర అని ప్రీలాంచ్లో కొనుగోలు చేసి చాలా మంది మోసపోతున్నారు. మోసపోయినవారు రూ.50 లక్షలు చెల్లించి మూడు, నాలుగేళ్లు అవుతున్నా పనులు మొదలుపెట్టని ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కొందరైతే ఏకంగా వారి పేరిట స్థలం లేకపోయిన జనాలను మోసం చేస్తున్నారు. వీరి మాటలు నమ్మిన వారు ఇళ్లు లేకుండా పోయారు.
- అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు రెరా అనుమతి ఉందా లేదా అని చూడాలి.
ఇంటి స్థలాల విషయంలో జాగ్రత్త :
- కొందరికి ఇళ్లు కొనే స్థోమత ఉండదు. అలాంటివారు ఏకంగా ఇంటి స్థలాన్నే కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో అక్కడ ఇల్లు కట్టుకోవచ్చనే ఆశ. లేకపోతే భూమి ధరలు పెరిగినప్పుడు అక్కడ అమ్మి వేరే చోట కొనుక్కోవచ్చని భావిస్తారు. లేదంటే పిల్లల పెళ్లి, చదువుకు అని చెప్పి పైసాపైసా కూడబెట్టి స్థలం కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి లేనివాటిలో కొని చిక్కుల్లో పడుతున్నారు.
- డీటీసీపీ అనుమతి ఉన్నా మార్ట్ గేజ్ చేసిన ప్లాట్లను అమ్మడానికి వీలులేదు. లేఅవుట్‌ను పూర్తిగా అభివృద్ధి చేస్తేనే సదరు సంస్థ వీటిని విడుదల చేస్తుంది. కానీ కొందరు మార్ట్గేజ్ చేసిన స్థలాలను ఈఎంఐ వెసులుబాటు ఉందని చెప్పి అమ్మేసి మోసం చేస్తారు. తీరా వాయిదా మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయమని అంటే మార్ట్గేజ్ ఇంకా విడుదల కాలేదని కాలయాపన చేస్తారు. ఈ తరహా మోసాలు ఎక్కువగా యాదగిరిగుట్ట, కొట్రా ప్రాంతాల్లో లేవుట్ వేసిన ఓ సంస్థ చేసింది.
- ఈఎంఐ పథకాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ధర పెరిగిందని మిగతా మొత్తాన్ని చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని ఇంకొందరు తిప్పుతున్నారు. అందుకే అత్యంత నమ్మకమైన ట్రాక్ రికార్డు ఉన్నవారి దగ్గర మాత్రమే ఇలాంటి పథకాల్లో చేరడం మేలు. లేకపోతే వద్దు.
- ఇంకొక ప్రధానమై అంశం ఏంటంటే మధ్యవర్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత మంది బ్రోకర్లు సొమ్మును తీసుకుని పబ్బం గడుపుతుంటారు. తీరా రిజిస్ట్రేషన్ చేయించమని అడిగితే ఇప్పుడు యజమానికి స్థలం అమ్మడం ఇష్టం లేదని మిమ్మల్ని నమ్మిస్తారు. ఇల్లు, స్థలం బేరం కుదిరితేనే సొమ్మును స్థిరాస్తి యజమానికి చెల్లించండి.
- ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మేలు. ఎందుకంటే ఆలస్యం అయితే ఆ తర్వా ఆస్తి విలువ పెరిగి అధికంగా డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు ఎన్నో. ఈ విషయంలో ఆలస్యం వద్దు. వందేళ్లు ఉండాల్సిన స్థిరాస్తుల కొనుగోళ్లలో సదా అప్రమత్తంగా ఉంటేనే ఆస్తులకు శ్రీరామ రక్ష.