Fatal Accident Relief Fund: రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలు ఆ కార్మికులవి. చేతినిండా పని దొరికితేనే నాలుగు వేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం కూలీల అడ్డాల వద్ద పనుల కోసం ఆశగా ఎదురు చూస్తూ.. దొరకని సమయంలో నిరాశగా ఇంటికి వెళ్లిపోతుంటారు. ఇదీ భవన నిర్మాణ రంగంలో పనిచేసే దినసరి కార్మికుల పరిస్థితి.
ఇలాంటి భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే.. తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తోంది. చనిపోయిన కార్మికుల నామినీకి రూ. 6లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. మరి, ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? దరఖాస్తు విధానమేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కార్మికుడికి గుర్తింపు ఉండాలి..
భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు మంజూరు చేస్తుంది. ఈ గుర్తింపు కార్డును కార్మికుడు కలిగి ఉండాలి. ఈ కార్డు లేనివారు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. ఈ కార్డు కలిగిన కార్మిడు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. ఈ గుర్తింపు కార్డుతో వారి నామినీ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సాయం పొందడానికి అర్హతలు..
- ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసే వ్యక్తి.. మరణించిన కార్మికుడి కుటుంబ సభ్యుడై ఉండాలి.
- మరణించిన వ్యక్తి తప్పనిసరిగా తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుడై ఉండాలి.
- నిర్మాణ రంగ కార్మికులు పని ప్రదేశం లేదా ఎక్కడైనా సరే ప్రమాదవశాత్తూ మరణిస్తేనే ఈ సహాయం అందుతుంది.
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు
- దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- మరణించిన కార్మికుడి రిజిస్ట్రేషన్ కార్డ్ (ఒరిజినల్)
- రెన్యూవల్ చలాన్ కాపీ
- మరణ ధ్రువీకరణ పత్రం
- పోలీస్ స్టేషన్లో నమోదైన FIR కాపీ
- పోస్ట్ మార్టమ్ పరీక్ష కాపీ
- అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
- బ్యాంక్ పాస్ బుక్ కాపీ
దరఖాస్తు విధానం..
- సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే.. అక్కడ దరఖాస్తు ఫామ్ ఇస్తారు. లేదంటే.. కార్మిక శాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కూడా ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- తర్వాత దరఖాస్తు ఫామ్‌లో అడిగిన వివరాలన్నీ నమోదు చేయాలి.
- అప్లికేషన్ ఫామ్‌తోపాటు అడిగిన ఇతర పత్రాలను దానితో జత చేయాలి.
- తర్వాత ఫామ్‌పై సంతకం చేసి సంబంధిత కార్మిక శాఖ అధికారికి అందజేయాలి.
- ఆ తర్వాత దరఖాస్తు చేసినట్టుగా అధికారి వద్ద నుంచి రిసిప్ట్ తీసుకోవాలి.
- మీ దరఖాస్తు తర్వాత.. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తగ్గని ప్రభుత్వ అధికారి దీనిపై విచారణ చేపడతారు.
- ప్రమాదవశాత్తుగానే మరణించినట్టు నిర్ధరణ జరిగితే.. నేరుగా దరఖాస్తు దారుడి బ్యాంక్ ఖాతాలో ఆర్థిక సాయం జమ అవుతుంది.
రైతన్నకు సర్కారు డబుల్ బొనాంజా - సీఎం రేవంత్ దసరా కానుకలు ఇవే! - CM Revanth on Paddy