High Court On mid Day Meal In Schools : ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల మాగనూరు, బూరుగుపల్లి ప్రభత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలో 6 వారాల్లో నివేదిక సమర్పించాలని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించింది.
మధ్యాహ్న భోజనంపై హైకోర్టు ఆదేశాలు : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధె, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ పేర్కొన్న మూడు ఘటనలే కాకుండా మరో రెండు ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ఆయా ఘటనలో బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకున్నట్లు ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు తెలిపారు. నారాయణపేట్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో వేర్వేరుగా రెండు కమిటీలు ఏర్పాటు చేశామని భోజనం వికటించిన ఘటనపై అధ్యయనం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.
మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత : ఇప్పటికే నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపామన్నారు. 25వేల 941 ప్రభుత్వ పాఠశాలల్లో 18లక్షల మందికి పైగా విద్యార్థులన్నారని వాళ్లలో 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారని ఏఏజీ వివరించారు. ఈ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర మార్గనిర్దేశకాల ప్రకారం గ్రామ, మండల, జిల్లా,రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కానీ క్షేత్రస్థాయిలో ఇలా చోటు చేసుకోవడం లేదని పిటీషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు.
ఆహారంలో గుడ్డు కూడా ఇవ్వడం లేదు : మధ్యాహ్న భోజనంలో సరైన ఆహారం పెట్టడం లేదని గుడ్డు కూడా ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. ఆ కమిటీలకు అదనంగానే ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై అధ్యయనానికి మరో రెండు కమిటీలు ఏర్పాటు చేశామని అన్ని కమిటీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని ఏఏజీ కోర్టుకు తెలిపారు. మధ్యాహ్న భోజనం వడ్డించే ఏజెన్సీలకు ప్రభుత్వం ఇటీవలే 40 శాతం డబ్బులు పెంచినట్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
మాగనూరు జడ్పీ పాఠశాలకు ఏమైంది? - మరోసారి వికటించిన మధ్యాహ్న భోజనం - ఈసారి 40 మందికి పైగా అస్వస్థత