TG High Court On Engineering Seats Issue : ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సులలో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సుల ప్రారంభించే అంశంపై అనుమతుల నిరాకరణపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీటీఈ, యూనివర్శిటీలు అనుమతించిన తరువాత ప్రభుత్వం సీట్ల పెంపును నిరాకరించడంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 4వ తేదీకి వాయిదా వేసింది. కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనంపై ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ ఈనెల 24న జారీ చేసిన మెమోతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన సాంకేతిక విద్యాచట్టంలోని సెక్షన్ 20ని సవాలు చేస్తూ పలు కళాశాలలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.
నిరాకరణపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు : వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది డి. ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కంప్యూటర్ సైన్స్ కోర్సు దాని అనుబంధ కోర్సులలో సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయూ నిరభ్యంతర పత్రం జారీ చేసిందని, దీని ఆధారంగా కాలేజీలు ఏఐసీటీఈ ఆమోదానికి దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఏఐసీటీఈ తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు, బోధన సిబ్బంది ఉండటంతో అనుమతి మంజూరు చేసిందన్నారు.
హైకోర్టు నోటీసులు జారీ : అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి మంజూరు చేయడంలేదన్నారు. కొత్తగా సీట్లను పెంచాలని కూడా కోరడంలేదని, ఆదరణ లేని కోర్సులను రద్దు చేస్తూ డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సుల సీట్లను పెంచమని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని కాలేజీలకు అనుమతులు మంజూరు చేసిందన్నారు. తమకు మాత్రం నిరాకరిస్తోందని, ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో తమకు సీట్ల కేటాయింపు నిరాకరిస్తోందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్, జేఎన్టీయూ, ఏఐసీటీఈ, ఉన్నత విద్యామండలి, ఈఏపీ సెట్ కన్వీనర్లకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.