Heavy Water Inflow to Sriram Sagar Project : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది. ఫలితంగా ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. శనివారం సాయంత్రం మొదలైన వర్షం, సోమవారం ఉదయం వరకు దంచికొట్టింది. ఆదివారం ఉదయం 35 వేల క్యూసెక్కులుగా ఉన్న వరద, క్రమంగా పెరుగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రానికి ఎగువ నుంచి రెండు లక్షల 51 వేల క్యూసెక్కులు పైగా వరద రాగా, మొత్తం 41 గేట్లు ఎత్తి రెండు 2,59,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద కాలువకు 15వేల క్యూసెక్కులు, 4 వేలు కాకతీయ కాలువలోకి, 4 వేల క్యూసెక్కులు ఎస్కేప్ గేట్ల ద్వారా విద్యుత్తు తయారీకి విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్తు కేంద్రంలోని నాలుగు యూనిట్ల ద్వారా 36 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 70టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో రైతులు హర్షం : మహారాష్ట్రలోని నాసిక్, నాందేడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదిపై ఉన్న బాలేగావ్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడంతో దాదాపు 1,80,000 క్యూసెక్కుల మేర వరద దిగువకు వస్తోంది. దీనికి తోడు కామారెడ్డి జిల్లాలోని మంజీర, నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం, నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు నుంచి కలిపి మరో 70 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"ఈ ఏడాది వర్షాభావ ప్రభావం వల్ల ప్రాజెక్ట్ నిండుతుందా లేదా అన్న అనుమానం ఉండేది. నాట్లు వేసే సమయంలో సైతం నీరు లేక బోర్లు పెట్టి పైర్లు నాటాం. కానీ ఇవాళ శ్రీరాంసాగర్ నిండుకుండలా మారడంతో చాలా సంతోషంగా ఉంది. ఇంక రెండు పంటలు పండుతాయి. మరోవైపు డ్యాం కట్ట తెగడంతో కొంతమేర పంటపొలాలు నీటమునిగాయి. ప్రభుత్వం స్పందించి పంట మునిగిన రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం."-రైతులు
గోదారి పరవళ్లు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు : గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ డ్యామ్ నుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు చూసేందుకు పెద్దఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఒడ్డున నిలబడి నీటి అలలు, పరవళ్లను చూస్తూ ఫోటోలు దిగుతున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ నీటి విడుదలను పెంచే అవకాశం ఉన్నందున, పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిండుకుండల్లా మారిన జలాశయాలు - భారీ వర్షాలతో సంతరించుకున్న జలకళ - Huge Floods in Dams