Heavy Rain Alert To Telangana : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.
శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఇందు కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో దీని ప్రభావం తెలంగాణపై పడి మోస్తరు నుంచి భారీ కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడతాయని వివరించారు. అనంతరం వాయుగుండం పోతుంది అప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రెడ్ అలెర్ట్ : ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని నాగరత్న తెలిపారు.
అప్రమత్తమైన అధికారులు : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతెనే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
మంత్రి సీతక్క పర్యటన రద్దు : అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాడుతున్నాయి. పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండడంతో గార్ల మండల కేంద్రం నుంచి రాంపురం, మద్దివంచ, పలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వానలకు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తుండగా, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి మహబూబాబాద్‌లో 75.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఫలితంగా మంత్రి సీతక్క పర్యటన రద్దు అయింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పడుతున్న వానలకు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీరు వెళ్లే మార్గం లేక పలు చోట్ల రోడ్లన్ని చెరువును తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బస్టాండ్ పరిసరాలలో భారీగా వరద నిలిచి ఇబ్బందికరంగా మారిపోయింది.
రాగల మూడు రోజులు తెలంగాణలో వానలే వానలు - అప్రమత్తమైన అధికారులు - Heavy Rain Alert To Telangana