Schools Closed Due to Rains : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, కుమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
సిద్దిపేట జిల్లా కోహెడలో 22.3, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో 19.8, నిజామాబాద్ జిల్లా తొండకూరులో 16.2 సెంటీమీటర్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లా అకెనపల్లిలో 12.7, యాదాద్రి భువనగిరి జిల్లా వెంకిర్యాలలో 10.6, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో 9, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా సింగపూర్ టౌన్లో 8.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తేరుకోకముందే, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పిల్లలకు సెలువులే సెలవులు : వర్షాల కారణంగా పలు జిల్లాలో కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కాలనీల్లో వరద పోటెత్తుతున్న నేపథ్యంలో పాఠశాలలను మూసివేశారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పరిస్థితులను బట్టి సోమవారం నుంచి పాఠశాలలు తెరవాలని సూచించారు. (బుధవారం నుంచి శుక్రవారం వరకు వర్షాల కారణంగా సెలవులు ప్రకటించగా, శనివారం గణేశ్ చతుర్థి, ఆదివారం సెలవు కావడంతో విద్యాసంస్థలు తిరిగి సోమవార పునఃప్రారంభం కానున్నాయి.)
స్కూళ్లు నడిపితే చర్యలు తప్పవు : అన్ని విద్యాసంస్థలు సెలవును కచ్చితంగా పాటిస్తూ, ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించాలని తెలిపారు. ఎవరైనా పాఠశాలలు నడిపినా, మండల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈరోజు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నడిపితే వారిపై చర్యలుంటాలని తెలిపారు.