Minister Ponnam Prabhakar On TGRTC Merging in Govt : శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావించగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనపై సమాధానాలతో ఎదురుదాడికి దిగారు. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్‌సీ బకాయిల గురించి గులాబీ నేత ప్రశ్నించారు. అదే విధంగా ఆర్టీసీ కార్మిక సంఘాలను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారని అడిగారు.
దీనికి సమాధానమిచ్చే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గత ప్రభుత్వంపై, బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదని మండిపడ్డారు. సమ్మె సమయంలో ఖమ్మంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆదరబాదరాగా ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు.
'ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఇచ్చాం. ఆర్టీసీని పూర్తిగా చంపేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు ఇస్తోంది. ప్రజారవాణా, ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నాం. 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నాం. పనిభారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తున్నారు.' అని మంత్రి పొన్నం ప్రభాకర్ కితాబిచ్చారు.
కూనంనేని సాంబశివరావు : ఇదే అంశంపై సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కాకుండా, కార్మికులు, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కూనంనేనికి అవకాశం ఇవ్వటాన్ని హరీశ్‌రావు ప్రశ్నించగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఆర్టీసీ కార్మికుల తరఫున మాట్లాడేందుకు కూనంనేనికి సభాపతి అవకాశమిచ్చారని తెలిపారు.
స్పందించిన హరీశ్‌రావు : ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ యూనియన్ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యచరణ చేపట్టలేదని మండిపడ్డారు. తాము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు.