Harish Rao on Congress over Drinking Water : పంటలకు సాగునీరు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోడానికి మంచినీళ్లైనా ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రం గొంతెండిపోతున్నదన్న ఆయన, గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని పేర్కొన్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని హరీశ్ రావు అన్నారు. పదేళ్ల కేసీఆర్(KCR) ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదన్న మాజీ మంత్రి, మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని గుర్తు చేశారు. ప్రజలకు మంచినీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Harish rao Comments on Congress over Guarantees : ఇదికాగా మరోవైపు ఈ నెల 11న బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి హరీశ్ రావు, నీటి కష్టాలను వివరిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందని, కరవు మొదలైందని, రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్న హరీశ్ రావు, గడ్డి కేంద్రాలను పెట్టి పశువులను కాపాడుకునే స్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరవే లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో 6 గ్యారంటీలన్నారని, కానీ అమలు కాలేదని విమర్శించారు. గడువు దాటినా హామీల అమలుపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెడతానన్న రేవంత్ రెడ్డి, అమలులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని నిలదీశారు.
బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలు లేవు : కేంద్ర ప్రభుత్వ తీరుతో నిరుద్యోగం, ఆకలి, పేదరికం అన్నీ పెరిగాయని హరీశ్‌రావు ఆరోపించారు. దేశంలో పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలిస్తామని భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతను మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలే లేవన్న ఆయన, మోదీ సర్కార్ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు.