BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy : కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ వెనకబాటుతనానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు. పాలమూరు వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఓట్లు, సీట్లు అనే విధంగా కాకుండా, ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలని హితవు పలికారు.
మిషన్ భగీరథపై లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వానికి తగదు : హరీశ్ రావు
పాలమూరులో వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజల కోసం కిట్లు తెస్తే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు 80 శాతం పూర్తయ్యిందని, ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు.
"పాలమూరు వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయి. పాలమూరులో వలసలకు కారణం కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదు. ఓట్లు, సీట్లే కాదు, నిజాయతీగా పని చేయాలి." -హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
'గోల్మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణతో పోలికా?' - రేవంత్‌పై బీఆర్ఎస్ విమర్శలు
హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి : విధ్వంసం, అరాచకం వచ్చేలా నేరపూరిత భాష మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. జనసామాన్యం సైతం అసహ్యించుకునేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని నాయకునిగా పరిగణిస్తున్నారో లేదో అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 'నేను అదే చేస్తా, అదే భాష మాట్లాడతా' అంటే ఎలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అంత నిస్పృహ ఎందుకు? ఆయన ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరు చెప్పారని నిలదీశారు. పక్కన ఉన్న వాళ్ల నుంచి పెనుముప్పు ఉందని భయపడి, రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలనపై దృష్టి లేదని, కుసంస్కారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు లేదు - కాంగ్రెస్ తెచ్చిన కరవే ఉంది : కేటీఆర్
ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించినందుకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు - రంగారెడ్డిలో 20 శాతం పనులు పూర్తి అయ్యాయన్న మంత్రికి కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, 20 శాతం పనులు చేసి 90 శాతం బిల్లులు ఎత్తుకున్నారా? అన్న విషయమై సహచర మంత్రి పొంగులేటిని అడగాలని సూచించారు. పక్కనున్న సోదరులు ఎటువైపు లాగుతారో అన్న భయంతో మోదీతో దోస్తానాకు రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తమకు లక్షలాది కార్యకర్తలు ఉన్నారన్న ఆయన, అరాచకత్వం వస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. హింసను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి మాట్లాడినందుకు హైకోర్టు, సుప్రీంకోర్టులు సుమోటోగా స్పందించాలని నిరంజన్ రెడ్డి కోరారు.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్ఎస్తోనే సాధ్యం : హరీశ్ రావు
'కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే చలో మేడిగడ్డ పర్యటన'