Harish Rao Tweet On Dog Attacks : కుక్కకాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. 'కుక్కలు పీక్కు తినడం', 'కుక్కకాటుకు మరణాలు' అనే వార్తలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయని ఆందోళన చెందారు. రాష్ట్రంలో కుక్క కాట్లు పెరిగిపోతున్నాయని ముందు నుంచీ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60 వేలకు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయని వెల్లడించారు. పదుల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోయిన ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని వాపోయారు.
" పసికందును పీక్కుతున్న కుక్కలు.." ఈ వార్త చూశాక నా మనసు కలచివేసింది. ఇంత హృదయ విదారక విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గం. కుక్కకాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరం.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 11, 2024
కుక్కలు పీక్కు తినడం, కుక్కకాటుకు మరణాలు అనే వార్తలు… pic.twitter.com/oVcQQpR2KI
యాంటీ రేబిస్ ఇంజెక్షన్లను అందించలేని దుస్థితి: నియంత్రణా చర్యలు పక్కన పెడితే, కనీసం యాంటీ రేబిస్ ఇంజెక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచడంలోనూ సర్కార్ తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని, చెత్తాచెదారం పేరుకుపోయి వీధికుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మున్సిపాలిటీలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేక మనుషుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని దుయ్యబట్టారు.
ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం : రాష్ట్రంలో 20 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటే అందులో 10 లక్షలకు పైగా కుక్కలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయంటే వీటి నియంత్రణలలో ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయినా, వాటి సంతాన నియంత్రణ ఆపరేషన్లకు (స్టెరిలైజేషన్) ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
కుక్క కాటుకు ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై హైకోర్టు తీవ్రంగా మందలించినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదని ఆక్షేపించారు. దేశంలో కుక్కకాటు నివారణకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను, కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో హరియాణా, పంజాబ్ హైకోర్టుల తీర్పును దృష్టిలో పెట్టుకొని కుక్క కాటుకు మరణించిన వారికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.