Guthpa Lift Irrigation Works Issue In Nizamabad : వేసవి ముగిసి వానాకాలం సమీపించింది. చెరువుల ఆయకట్టు కింద ఉన్న పొలాల రైతులు ప్రత్యేక పైప్‌లైన్ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్పలో నిర్మిస్తున్న ప్రత్యేక పైపులైన్‌తో నీటిని ఎత్తి పోస్తే రెండు నియోజకవర్గాల్లోని బీడు భూములు సాగుకు యోగ్యంగా మారుతాయని అక్కడి రైతులు కలలుగన్నారు. కానీ వారికి నిరాశే మిగులుతోంది. హడావుడిగా ప్రారంభించిన ప్రత్యేక పైపులైన్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
Guthpa Pipe Line Works Issue : నిజామాబాద్ జిల్లాలో గుత్ప ఎత్తిపోతలతో భాగంగా పది చెరువుల్లో నీటిని నింపాలనే లక్ష్యంతో 2016లో 23 కోట్ల 80 లక్షల రూపాయలతో పనులకు భూమిపూజ చేశారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి, గుత్ప, రాంచంద్రపల్లి, అమ్రాద్, జక్రాన్‌పల్లి మండలంలో మునిపల్లి, అర్గుల్, ఆర్మూర్ మండలం అంకాపూర్‌లోని చెరువులకు ప్రత్యేక పైపులైన్‌తో సాగునీరు నీరందించడం ప్రధాన లక్ష్యం. పనులు 2019 ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగితా 10శాతం పనులు చేస్తే 3వేల ఎకరాల్లో పంటలకు సాగు నీరందుతుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
మే నెలాఖరుకు సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పైపులైన్ పనులు పూర్తిచేయాలి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పైపులైన్ పనులపై దృష్టి సారిస్తే తమకు మేలు జరుగుతుందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చొరవ చూపితే మిగిలిన పనులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయని వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే గుత్ప ప్రత్యేక పైప్‌లైన్ పనులు పూర్తి చేసి సాగు నీరు అందించేందుకు కృషి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
"దాదాపు గుత్ప లిఫ్ట్ ద్వారా దాదాపు తొమ్మిది గ్రామాలకు సాగు నీరు అందుతుంది. అలాంటిది ఎనిమిది సంవత్సరాల నుంచి పైపులైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పంటలకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 10శాతం పనులు పూర్తి కావాలి. దీనిపై అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం పట్టించుకుని పనులు పూర్తిచేయాలని కోరుతున్నాం." -రైతులు