Gurramgadda Villagers Problems : గద్వాల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది మధ్యలో గుర్రంగడ్డ అనే గ్రామం ఉంటుంది. సుమారు వెయ్యికి పైగా జనాభా ఉండే ఈ ఊరికి వెళ్లాలంటే ఏరు దాటాలి. గతంలో గ్రామ ప్రజలు పుట్టీలో ప్రయాణించి రాకపోకలు సాగించేవాళ్లు. అయితే ప్రభుత్వం మరబోటు సమకూర్చడంతో ప్రస్తుతం అందులోనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలు మాత్రమే బోటు నడుస్తుంది. ఏ అవసరం ఉన్నా గ్రామస్థులు అప్పుడే ఏరు దాటాలి. అదీ సాధారణ రోజుల్లోని పరిస్థితి.
వర్షాకాలంలో కృష్ణానది పొంగేతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రమాదకరమైన ప్రయాణం సాగించాల్సిందే. ప్రభుత్వం బోటిచ్చి ఐదేళ్లు దాటిపోవడంతో అది కూడా పనికిరాకుండా పోయింది. అందులో కూడా కనీస రక్షణగా లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో లేవు. దీంతో గుర్రంగడ్డ గ్రామస్థులు బోటులో బిక్కుబిక్కు మంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
యువతీ యువకుల వివాహం కష్టమే : గుర్రంగూడ గ్రామస్థులు ఎక్కడికి వెళ్లాలన్నా నది దాటాలి. అందువల్ల రైతులు పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు. ఐదోతరగతి వరకే పాఠశాల ఉండటంతో ఆ తర్వాత పిల్లలు చదువు కొనసాగించలేక పోతున్నారు. కనీసం ఆ ఊరి యువతీ యువకులను వివాహం చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. నది పొంగితే వరద గ్రామాన్ని చుట్టుముడుతుంది. పాములు, తేళ్లు, విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయి. ఎవరైనా అనారోగ్యం పాలైతే కనీసం ఆస్పత్రికి కూడా వెళ్లే పరిస్థితి లేదని గ్రామస్థులు వాపోతున్నారు
గ్రామస్థులే సొంతంగా రోడ్లు : నవంబర్ తర్వాత కృష్ణానది ప్రవాహం తగ్గిపోతుంది. ఆ సమయంలో ఊళ్లోంచి నది మీదుగా వెళ్లేందుకు గ్రామస్థులే స్వయంగా రోడ్డు వేసుకుంటారు. ఇందుకోసం కుటుంబానికి వెయ్యి, రెండు వేల చొప్పున వసూలు చేస్తారు. జూన్ మొదలుకొని సెప్టెంబర్ వరకు నది ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో రోడ్డు కొట్టుకుపోతుంది. డబ్బులు వసూలు చేసి మళ్లీ రోడ్డు వేస్తారు. ఇలా పదేళ్లుగా రోడ్డు వేస్తూనే ఉన్నారు. గ్రామస్థులకు ఏటా ఆర్ధికభారం తప్పడం లేదు.
ఏళ్లుగా అసంపూర్తి నిలిచిపోయిన వంతెన : అయితే ఈ సమస్య పరిష్కారం కోసం 2018లో గత ప్రభుత్వం వంతెన మంజూరు చేసింది. టెండర్లు పూరై 2019లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. నత్తనడకన సాగి అర్థాంతరంగా ఆగిపోయాయి. నదీ ప్రవాహం వల్లేనని ఒకసారి, బిల్లులు రాలేదని మరోసారి ఇలా ఏవో కారణాలతో వంతెన నిర్మాణం పనులు ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఏళ్ల తరబడి తమ గోడు ప్రజాప్రతినిధులకు వెల్లబోసుకున్నా అధికారులకు తమ బాధలు విన్నవిచుకున్నా ఎవరూ తమ సమస్యను పరిష్కరించడం లేదని గుర్రంగడ్డ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం వంతెన పూర్తిచేయాలని గుర్రంగడ్డ గ్రామస్థులు కోరుతున్నారు.
డేంజర్ అలర్ట్ - ప్రమాదకరంగా వాగు దాటుతున్న వీరిని చూశారా? - Tribals Crossing canal Dangerously
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు - ఊళ్లు, పొలాలను ముంచెత్తుతున్న వరద - Rain In AP