Groundnut Farmers Protest in Mahabubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులు సరైన ధర నిర్ణయించడం లేదంటూ ఆందోళన బాట పట్టారు. నాగర్‌ర్నూల్ జిల్లా అచ్చంపేటలో గిట్టుబాటు ధర కోసం రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్‌కు వచ్చిన వేరుశనగ(Ground Nut)కు ధర నిర్ణయించిన అనంతరం క్వింటాకు కనీసం రూ.7000 ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్లారు. గతంలో ధరలు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ మద్దతు ధర రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులతో మాట్లాడతానని ఛైర్‌పర్సన్ అరుణ రైతులకు నచ్చజెప్పే క్రమంలో కోపోద్రిక్తులైన కర్షకులు కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఛైర్‌పర్సన్‌ను బలవంతంగా వేరుశనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. పలువురు మహిళా రైతులు ఆమెపై దాడి చేశారు.
అనంతరం వ్యాపారులు రావాలంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో(Farmers Protest)కు దిగారు. రైతులను ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు రావటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వేరుశనగకు రీటెండర్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మరోవైపు అచ్చంపేట మార్కెట్‌కు ఆదివారం 32,875 బస్తాల వేరుశనగ వచ్చింది. వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా ఇద్దరు రైతులకు రూ.5000 లోపు ధర పలికింది. అయితే వనపర్తి, కల్వకుర్తి, ఇతర మార్కెట్ల కన్నా అచ్చంపేటలోనే అధిక ధరలు ఉన్నాయని మార్కెట్ కార్యదర్శి వెల్లడించారు. రైతులు రూ.7000 కన్నా ఎక్కువ ధర డిమాండ్ చేస్తున్నారని దీనిపై వ్యాపారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎనుమాముల మార్కెట్ యార్డు ఎదుట మిర్చి రైతుల ధర్నా - వ్యాపారులు దగా చేస్తున్నారంటూ ఆవేదన
"సరకు మార్కెట్‌కు వచ్చేవరకు రూ.6000 నుంచి రూ.7000లు. రైతులకు ఏమో రూ.5500. ఇలా చూస్తే రైతులకు ఏమైనా సంబంధించిన రేటు ఉందా. వేరుశనగ నాటిన దగ్గర నుంచి ఆ పంట చేతికి అందివచ్చే వరకు పెట్టుబడి ఎక్కువ మొత్తంలో అవుతుంది. రైతులే పండించిన పంటకు రేటు చెప్పొద్దా." - రైతులు
Groundnut Farmers Protest Against Govt : కల్వకుర్తిలోనూ వేరుశనగ రైతులు గిట్టుబాటు ధర(Reasonable Price of Groundnut) కోరుతూ రోడ్డెక్కారు. ఆదివారం 12,284 బస్తాల వేరుశనగ వచ్చింది. కనిష్ఠ ధర రూ.4,806, సగటు ధర రూ.6,100, గరిష్ఠ ధర రూ.7000 పలికింది. ఎక్కువ మంది రైతులకు రూ.6000 నుంచి రూ.7000 లోపే ధర పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. మార్కెట్ నుంచి కోదాడ-రాయచూరు హైవేలోని హైదరాబాద్ కూడలి వద్ద మూడున్నర గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కూడలికి మూడు వైపుల సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రైతులను తిరిగి మార్కెట్‌కు తీసుకెళ్లి రాకపోకలను పునరుద్ధరించారు. వ్యాపారులతో కుమ్మకై తక్కువ ధరలు నిర్ణయిస్తున్నారని మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా సరైన ధరలు ఇవ్వట్లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
Mahabubnagar Groundnut Farmers Problems : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగిలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 2లక్షల 30వేల ఎకరాలు కాగా ఈసారి 2 లక్షల ఎకరాల్లోపు సాగైంది. పాలమూరు వేరుశనగకు బహిరంగ విపణిలో మంచి డిమాండ్ ఉంది. పంట విస్తీర్ణం తగ్గినా దిగుబడులు బాగానే వచ్చాయి. పంట నాణ్యత సైతం బాగుంది. అయినా వ్యాపారులు సరైన ధర ఇవ్వడం లేదన్నది రైతుల ఆవేదన. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నది కర్షకుల డిమాండ్.
పసుపు పంటకు పూర్వ వైభవం వచ్చేనా? - గిట్టుబాటు ధర లేక సాగు తగ్గిస్తున్న రైతులు
నిండా మునిగిన మిరప రైతులు - తెగుళ్లతో దిగుబడులు తగ్గి దిగాలు