Govt Focus On Crop Loan Waiver : శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రూ.2 లక్షల వరకు రైతురుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈలోగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ నిబంధనల కారణంగా ఆలస్యం అయింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది.
ఆగస్టు15లోగా రైతు రుణమాఫీ చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు రుణమాఫీ పై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపిన సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయాలు, ఇతర అంశాలపై అధ్యయనం చేశారు.
Govt Focus On Funds For Loan waiver : హామీ ఇచ్చిన తేదీలోపు రుణమాఫీ చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అవసరమైన నిధుల సమీకరణపైనా ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ మేరకు రైతుసంక్షేమ సంస్థను ఏర్పాటు చేసి ఆదాయ వనరులు సమీకరిస్తామని, వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతు రుణమాఫీ అమలు చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.
రుణమాఫీకి రూ.33-35 వేల కోట్ల రూపాయలు వరకు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా. అలానే రాష్ట్ర రెవెన్యూ, ఖర్చు, రుణాలకు ప్రతినెలా చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఇలా అన్ని అంశాలతో సహా రుణమాఫీ అమలుకు ఎంత మొత్తం అవసరమో కూడా స్పష్టత వచ్చినట్లు సమాచారం.
స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)పై చర్చ : గతంలో రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణం తీసుకొని తర్వాత కిస్తీల రూపంలో ప్రతి నెలా అప్పులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అందుకే రుణమాఫీ కోసం కూడా ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి "స్పెషల్ పర్పస్ వెహికల్ - ఎస్‌పీవీ" ద్వారా అమలు చేసే విధానంపై సమావేశాల్లో విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. అదే బ్యాంకులు రుణాన్ని మాఫీ చేసినట్లైతే ఆ మొత్తం ప్రతి నెలా కొంత మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించే విధానం అమలు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.
రుణమాఫీ ప్రతిపాదనకు భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ ప్రతిపాదనపై బ్యాంకులతో చర్చించాలని, వీలు కాకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు ఆదాయం సమీకరణకు భూములు విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలు సవరించడం ద్వారా ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
నిధుల సమీకరణపై దృష్టిపెట్టిన ప్రభుత్వం : రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన భూముల అమ్మకం ద్వారా నిధులు సేకరించడం, ఆ మొత్తం రైతు రుణమాఫీకి కేటాయించాలనే అంశమూ ప్రస్తావనకు వచ్చింది.రూ.2 లక్షల రుణమాఫీతోపాటు రైతు భరోసా ద్వారా ఎకరాకు 15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో ఈ పథకాలు అమలు చేయడానికి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. గత బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 26 వేల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
ఐతే రైతుబంధు సాయం పెరగడం, సహా 2 లక్షల రుణమాఫీ అమలుకు అదనంగా నిధులు అవసరం అవుతాయని ఆర్థికశాఖ, వ్యవసాయ శాఖ లెక్కలు గట్టాయి. రాష్ట్ర వ్యవసాయ భూకమతాలు 85 నుంచి 90 లక్ష ఎకరాలు ఉన్న దృష్ట్యా 18 నుంచి 20 వేల కోట్ల రూపాయల అదనంగా నిధులు అవసరం ఉండవచ్చని వ్యవసాయ నిపుణుల అంచనా. అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు రైతు గాని రైతును జాబితాల్లో తొలిగించే అవకాశాలు లేకపోలేదు.
బ్యాంకర్లతో సంప్రదింపులు : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లు ఏకకాలంలో 2 లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పంట అప్పును చెల్లించాలంటే 35కోట్లకు పైగా అవసరం. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని అధికారులు స్పష్టతనిచ్చారు. ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలాన్ని ప్రభుత్వం నిర్ధేశించి రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లను సంప్రదించారు.
మార్గదర్శకాలు రూపొందించే పనిలో ప్రభుత్వం : రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది. గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేశారు. ఈ అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని రెన్యువల్ చేసుకోలేదు. మరి వారికి మాఫీ వర్తిస్తుందా అన్నది చూడాలి. కాగా రైతుల రుణాలకు సంబంధించి బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థికశాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 2లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఆయా బ్యాంకుల బ్రాంచీలు పంట రుణాల జాబితాలను తయారు చేసే పనిలో ఉన్నాయని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.
Challenges Before The Government : రూ.2లక్షల రుణమాఫీ అతి పెద్ద హామీ. అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. కాగా రుణమాఫీ అమలు మిగిలిన వ్యవసాయ పథకాలపై ఏమైనా ప్రభావం పడుతుందా అనేది రైతుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తుంది. ఏటా సీజన్ ఆరంభంలో రైతుల పెట్టుబడుల కోసం ఇచ్చే సాయం రైతు భరోసా పథకం, విత్తన రాయితీలు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్, ఇతర పథకాల అమలు, అంశాలపై ఎలాంటి ప్రభావం పడకూడదని రైతులు కోరుతున్నారు.
రైతు రుణమాఫీ పేరు చెప్పి ఇతర పథకాల అమల్లో నిధులకు కోత పెడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. ఏదేమైనా ప్రభుత్వం సంకల్పించుకున్నట్లు 2లక్షల రుణమాఫీ చేస్తే ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రయోజనం చేకూరుతుందనేది నిపుణుల అభిప్రాయం.
రైతు రుణమాఫీపై సర్కార్ కసరత్తు - నిధుల సమీకరణకు మార్గాల అన్వేషణ - TS Crop Loan Waiver Scheme 2024