Government Order Investigation on Karimnagar Manair River Front : కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులపై విచారణ అంటేనే అధికారుల్లో వణుకుపుడుతోంది. తొలుత హౌసింగ్‌బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినప్పటికీ, పూర్తిస్థాయిలో దృష్టి పెట్ట లేదు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్‌సిటీ అక్రమాలతో పాటు తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, గెస్ట్ హౌజ్ నిర్మాణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ పమెలా సత్పతికి ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో విచారణ వేగవంతమైంది. సాంకేతికంగా నగరపాలక సంస్థ అధికారులే బాధ్యులుగా తేలే అవకాశం ఉంది.
ఇప్పటికే భూ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ విభాగ అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తుండగా, స్మార్ట్ సిటీ పనులపైనా విచారణ జరిగితే మరికొంత మంది ఇంజినీరింగ్ అధికారుల అక్రమాల బాగోతం వెలుగులోకి రానుంది. గత ప్రభుత్వ కృషి ఫలితంగా స్మార్ట్‌సిటీ జాబితాలో చోటు దక్కడంతో కరీంనగర్ నగరపాలక సంస్థకు నిధుల వరద వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.740 కోట్లు రూపాయలు విడుదల కాగా, ఇందులో రూ. 539 కోట్లు చెల్లించారు.
స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, స్మార్ట్ వీధిదీపాల నిర్మాణం దాదాపు పూర్తయింది. కొన్ని కూడళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఇక కమాండ్ కంట్రోల్, లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలు, పార్క్‌లు తదితర పనులు సైతం పూర్తి కావాల్సి ఉంది. నిర్మాణపు పనుల్లోని అక్రమాలపై గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని పలువురు నాయకులు ఆరోపిస్తిున్నారు. వందల కోట్లతో చేపట్టిన స్మార్ట్‌సిటీ పనుల్లో కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి.
Sarkar Focus on Misuse of Smart City Funds in Karimnagar : ప్రధానంగా బల్దియాలో అంతా తానై వ్యవహరించిన ఓ ఇంజినీరింగ్ అధికారి కనుసన్నల్లో చేసిన అంచనాలే తప్పినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇష్టారీతిన పనుల అంచనాలు పెంచి నిధులను కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించినట్లు అభియోగాలున్నాయి. రూ. 50 లక్షలతో పూర్తయ్యే జంక్షన్ పనికి, కోటికి పైగా బిల్లు చేసిన వైనం నగర పాలక సంస్థ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. కలెక్టరేట్ రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేడ్కర్ స్టేడియం, టవర్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి.
సీసీరోడ్లు, ఫుట్‌పాట్‌లు కుంగిపోగా, డ్రైనేజీలు నిర్మాణంలోనే కూలిపోయాయి. కూడళ్లకు నాసిరకం మెటీరియల్ ఉపయోగించారని ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు రూ. 183కోట్లతో నిర్మించిన తీగల వంతెన, రూ. 410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని నిర్ణయించడం పట్ల స్థానికుల్లో హర్షం వ్యక్తమౌతోంది. ఒకవైపు అంచనాలకు మించి నిధుల వినియోగంతో పాటు నాణ్యతలోని డొల్లతనానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో విచారణ సాగడం చర్చనీయాంశంగా మారింది.
'మానేరు రివర్ ఫ్రంట్ దాని కన్నా ముందు ఉన్న చెక్ డ్యాంలు కొట్టుకపోతే రూ.రెండున్నర కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని ఆరోజు చెప్పాం. చెక్ డ్యాంలు కొట్టుకుపోయిన చోటే మానేరు బ్యారేజీ నిర్మించి, పాత చెక్ డ్యాంలు రికవరీ చేయలేదు. దానిమీద కూడా విచారణ జరుగుతోంది. కరీంనగర్‌లో జరిగిన స్మార్ట్ సిటీ పనులన్నీ నాణ్యత లోపంతో జరిగాయి' -కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు
భూకంప అధ్యయనం లేకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం : కాగ్
'బాగు కోసం ఊరు వదిలేస్తే - ఉన్న ఉపాధినీ దూరం చేశారు - మమ్మల్ని ఆదుకోండయ్యా'