TG Govt Extend Rationcard E-KYC Update : రేషన్‌కార్డు ఈ-కేవైసీ అప్డేట్ చేయించుకోడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ -కేవైసీ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకే చౌక ధరల దుకాణంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబంలో లబ్ధిదారుల్లో ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోనట్లయితే వారి పేర్లను కార్డు నుంచి తొలగించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. గతనెల సెప్టెంబర్‌లో ముగిసిన గడువును డిసెంబరు 31వరకు పెంచింది. ఇదే చివరిసారని, మరోసారి ఈ అవకాశం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువులోగా ఈ-కేవైసీ చేయించని నేపథ్యంలో పేర్లు సరిగా లేకపోతే పథకాల లబ్ధికి ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.
లబ్ధిదారులకు అవస్థలు : రాష్ట్రవ్యాప్తంగా పలువురు లబ్ధిదారులు ఆధార్ సెంటర్లకు ఎన్నిసార్లు తిరిగినా బయోమెట్రిక్ పూర్తికావడం లేదు. వేలిముద్రలు పడకపోవడంతో విసిగిపోతున్నారు. వృద్ధుల విషయంలో ఈ సమస్యలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ- కేవైసీ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికీ పూర్తి కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రేషన్‌కార్డు ఈ-కేవైసీ అప్డేట్‌కు గడువు పొడిగిస్తుందని, ఇతర కారణాలతోనే నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు.
ఈ-కేవైసీ జాప్యానికి కారణాలు :
- ఆధార్ అప్డేట్ చేయించుకోకపోవడం, బయోమెట్రిక్ ఇబ్బందులు, టెక్నికల్ సమస్యలు ఎదురవ్వడం
- గత పదేళ్లలో చాలామంది మరణించారు. వారి వివరాలు అప్డేట్ చేయలేదు
- యువతులు వివాహాలు చేసుకుని వెళ్లిపోవడం
- వివాహం చేసుకుని కొత్త కాపురాలు ఏర్పాటు చేసుకున్న వారి పేర్లు తొలగించినా, కొత్త కార్డులు మంజూరు కాలేదు
రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్ కార్డులుండగా, వాటి పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డుదారులకు 6 కిలోల బియ్యం (కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో) ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా, అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కిలోల బియ్యం అందజేస్తున్నాయి.