Drinking water supply Project in Karimnagar : కరీంనగర్‌కు దిగువ మానేరు జలాశయం అందుబాటులో ఉండటంతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలాన్ని అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల నివాసాలను లక్ష్యంగా నిర్ణయించుకున్న నగరపాలక సంస్థ, ఇప్పటికే 3వేల ఇళ్లకు పైగా మీటర్లను బిగించింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మాడ్రన్ హౌజింగ్ బోర్డు కాలనీకి ప్రయోగాత్మకంగా నిరంతర మంచినీరు సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్‌లో అందరికీ నిరంతర నీటి సరఫరా అందిచాలన్న ప్రణాళిక ఉన్నా 4 డివిజన్లలో ఎదురయ్యే లోటుపాట్లు పరిశీలించి మిగతా చోట్ల అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టులో ఇబ్బందులు తెలుసుకొని ఏజెన్సీ సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారంలో ఒక్కొక్కరికి రోజుకు 160 లీటర్లు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో ఇంటి నుంచి నీటి సరఫరా కోసం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నీటిని వృథా చేయకుండా వాడుకుంటే 100 రూపాయల కంటే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.
'కరీంనగర్‌లో హౌజింగ్ బోర్డు పరిధిలో దాదాపు 4 డివిజన్లలో నాలుగు వేల గృహాలకు సంబంధించి 24 గంటలు మంచినీరు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రూ.18 కోట్లతో పనులు ప్రారంభించాం. పైప్‌లైన్ల పనులు పూర్తవుతున్నాయి. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో 4 వేల గృహాలకు మంచి నీరు అందేలా ప్రణాళికలు తీసుకుంటున్నాం'- సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
ప్రస్తుతం దిగువమానేరు జలాశయంలో నీటి మట్టం 5 టీఎంసీలకు పడిపోవడంతో రోజు మినహా రోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సమస్య వల్ల కొన్నిసార్లు నీటిసరఫరా సమయంలో గందరగోళం నెలకొంటోంది. నిరంతర నీటి సరఫరా వల్ల ఇబ్బందులు తొలుగుతాయని గృహిణులు చెబుతున్నారు. పైప్‌లైన్లు ఇతరత్రా పనులు చివరి దశకు చేరడంతో భవిష్యత్‌లో నిరంతర నీరు సరఫరా అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
'మంచినీళ్లు రోజు వస్తున్నాయి కానీ గంట మాత్రమే వచ్చేవి. ఆ సమయంలో మేం లేకపోతే ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు దానికి మీటరు బిగించారు. దీంతో రోజులో ఎప్పుడైనా వస్తున్నాయి. వాటర్ ప్రస్తుతం స్లోగా వస్తున్నా ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నారంట ఒకవేళ మేం లేకపోయినా వచ్చినా తర్వాత ఆన్ చేసుకునేలా సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు 24 గంటల నీరు సరఫరా అవుతోంది. ఇంతకముందు ఉన్న ఇబ్బందులు ఇప్పుడు లేవు'- గృహిణులు