Godavari Water Level at Bhadrachalam : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి నీటి మట్టం 32 అడుగులు దాటి ప్రవహిస్తోంది. శనివారం మధ్యాహ్నం 23 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం, ఇవాళ మధ్యాహ్నానికి సుమారు 10 అడుగులు పెరిగింది. గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాళి పేరు జలాశయం వద్ద 25 గేట్లను ఎత్తి 48 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు.
భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాచలంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. దుమ్ముగూడెం మండలం గంగోలు ప్రధాన రహదారి వద్ద వర్షపు నీరు చేరడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు మండలంలోని వలస ఆదివాసి గ్రామం ఉర్ల దోసపాడు గ్రామంలో భారీ వర్షానికి సుమారు 15 పశువులు మృత్యువాత పడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
మురుగు నీటిని బయటకు తోడటానికి మోటార్లు ఆన్ : విస్తా కాంప్లెక్స్ ఏరియాలో అన్నదాన సత్రం పడమర మెట్ల ప్రాంతం వద్ద రాత్రి ఒంటిగంట సమయంలో వర్షపు నీరు నిలవడంతో అక్కడి దుకాణదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి గోదావరి కరకట్టల లాకులను ఎప్పటికప్పుడు పరిశీలించి వర్షపు నీరు పెరిగితే వెంటనే గోదావరిలోనికి వదిలివేయాలని తెలిపారు. మురుగు నీటిని బయటకు తోడటానికి మోటార్లను ఆన్ చేసి ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మంలో మున్నేరు ఉద్ధృతి : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ, ఖమ్మం నగరంలో బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తడంతో, అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు ఒక మహిళ, వృద్ధురాలు ఉన్నారు. కాలనీలు నీట మునగడంతో ఇళ్లపైకి స్థానికులు చేరి, రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.