Garuda Vahana Seva : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవ తిరుమల గిరుల్లో ప్రారంభమైంది. భక్తుల కన్నులకు ఆనందం కలిగిస్తూ మాడవీధుల్లో గరుడ వాహనంపై తిరుమలేశుడు ఊరేగుతున్నారు. గురుడవాహనంపై శ్రీవారు కొంగు బంగారంగా కనిపిస్తున్నారు. గరుడ సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులతో మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటువైపు చూసిన గోవిందా గోవిందా అనే నామస్మరణం వినిపిస్తోంది. మొత్తం మాడవీధుల్లోని 231 గ్యాలరీలు భక్తులకు కేటాయించగా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. గరుడ సేవకు అత్యధికంగా భక్తులు తిరుమలకు తరలివచ్చిన నేపథ్యంలో టీటీడీ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేసింది. మాడవీధుల్లోని గ్యాలరీలు సరిపోక శిలాతోరణం కూడలి నుంచి క్యూలైన్లోకి భక్తులు ప్రవేశించారు.
భక్తులకు అన్ని సౌకర్యాలను టీటీడీ ఏర్పాటు చేసింది. వారికి నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తోంది. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగిపోతోంది. తిరుమలకు 400కు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. సుమారు 3.5 లక్షల మంది భక్తులు గరుడ సేవను తిలకిస్తున్నారని అంచనా. గ్యాలరీల్లోనే సుమారు రెండు లక్షల మంది గరుడ సేవలో ఉన్న స్వామి వారిని తిలకించనున్నారు. గరుడ సేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది.
బైకులు, ట్యాక్సీలకు నో ఎంట్రీ : కలియుగ దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ ఏడుకొండలవాడు ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల మాడవీధుల్లో విహరిస్తూ దేవదేవుడు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోయింది. గరుడ సేవను దృష్టిలో ఉంచుకొని రాత్రి 9 గంటల నుంచి రేపు(బుధవారం) ఉదయం 6 గంటల వరకు బైకులు, ట్యాక్సీల రాకపోకలకు ఘాట్‌రోడ్డుపై అనుమతిని నిలిపివేశారు.
గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు : అంతకు ముందు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించేలా సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. వకుళామాత, వెంగమాంబ కేంద్రాల నుంచి అన్న ప్రసాదాల పంపిణీ నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.
తిరుమల శ్రీవారి గరుడసేవ ఎఫెక్ట్ - ఆ వాహనాలకు నో ఎంట్రీ!! - Tirumala Garuda Vahana Seva