Gannavaram Ex MLA Vallabhaneni Vamsi Arrest : ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో అనుచరుడు రమేశ్‌ను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైఎస్ఆర్సీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గన్నవరం తదితర ప్రాంతాల్లో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మొన్నటి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెదేపా కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.