Monsoon Crop Cultivation in Telangana : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురవగా నైరుతి రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నదాతలు విత్తనాల కొనుగోళ్లపై దృష్టి సారించారు. అధిక దిగుబడుల కోసం సమయం దాటకముందే విత్తనాలు కొనేందుకు దూకాణాల ముందు బారులు తీరారు. దీంతో జిల్లాలోని విత్తన దుకాణాలన్నీ రైతులతో కిటికటలాడుతున్నాయి.
Rush at Seeds Shops in Telangana : ఉమ్మడి జిల్లాలో పత్తి, వరి, మిరప, మొక్కజొన్న పంటలను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు పలు కంపెనీలకు చెందిన వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర అధికంగా ఉండటంతో వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశతో ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నా ఈ సారైనా కాలం కలిసి వచ్చి అధిక లాభాలు రావాలని కోరుకుంటున్నారు.
'వ్యవసాయంలో ఖర్చు ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం ఎరువులకు 16 వందల రూపాయల నుంచి రెండు వేలు అవుతోంది. పిచికారి మందుకు కూడా ఎక్కువ ధర ఉంది. ఆ విధంగా రైతుకు ఏమీ మిగలడం లేదు. ప్రస్తుతం వానలు పడే అవకాశం ఉందని విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చాం' - రైతులు
ధరలు అమాంతం పెంచారని రైతుల ఆందోళన : గతంతో పోలిస్తే ఈ సారి ధరలు అమాంతం పెంచారని రైతులు వాపోతున్నారు. రాబడి కన్నా పెట్టుబడులే ఎక్కువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రైతులు ఒకే రకమైన విత్తనాలు కాకుండా వివిధ రకాల విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతుల అవసరాలను తెలుసుకుని నకిలీ విత్తనాల విక్రయదారులు విజృంభిస్తున్నారు. కొందరు దుకాణదారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వీరిపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల కొరడా ఝళిపిస్తున్నారు.
తనిఖీల్లో విత్తన, ఎరువుల దుకాణాల యజమానులను అదుపులోకి తీసుకుని వారి నుంచి అధిక ధరలకు అమ్మడానికి సిద్ధంగా ఉంచిన పత్తి విత్తన సంచులను స్వాధీనం చేసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు అమ్మి, అమాయక రైతులను మోసం చేసే విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
'ఈసారి త్వరగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో రైతులు విత్తనాల కోసం దుకాణాలకు వస్తున్నారు. అయితే కాటన్ ఉత్పత్తిలో మాత్రం సమస్య ఉండి తక్కువ విత్తనాలు ఉన్నాయి. రైతులు అన్ని రకాల పంటల వైపు దృష్టి పెట్టాలి. ఒకదాని మీదే ఆధారపడి ఉండకుండా ఉండాలి' - విత్తన దుకాణాదారులు