Ex Minister Patnam Reaction on HYDRA : ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో తనకెలాంటి అక్రమ కట్టడాలు లేవని మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన వివరణనిచ్చారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్‌లో ఉన్న గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మించారని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై ఆయన స్పందించారు.
హైడ్రాకు పూర్తి మద్ధతు : హిమాయత్ సాగర్‌లోని తన గెస్ట్ హౌస్‌కు సంబంధించి వస్తున్న ఆరోపణలపై పట్నం మహేందర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులను పరిరక్షించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి తన మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. కొత్వాల్ గూడలోని ఓ ముస్లిం కుటుంబం నుంచి తమ తాతల కాలంలో దాదాపు 15 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అందులో గెస్ట్‌హౌస్ చిన్నగా నిర్మించుకున్నామని, అది తన కుమారుడి పేరు మీద ఉందని పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారమే నిర్మాణం : గెస్ట్ హౌజ్ వద్ద తోటలు, పశువులను పెంచుకుంటూ వ్యవసాయం చేస్తున్నట్లు పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. అది పట్టా భూమని, చాలా స్పష్టంగా అన్ని నిబంధనలు పాటించినట్లు తన వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. 111 జీవో పరిధిలో చాలా మంది నిర్మాణాలు చేసుకున్నారని, చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిర్మించుకున్నారని వెల్లడించారు. తన గెస్ట్ హౌస్‌కు దగ్గరలోనే చాలా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయని చెప్పారు.
అందరి నిర్మాణాలతో పోలిస్తే తన గెస్ట్ హౌస్ చాలా చిన్నదని, ప్రభుత్వం అనుమతి ఇస్తేనే నిర్మించుకున్నామని పట్నం స్పష్టం చేశారు. తనకు ఇప్పటివరకు గెస్ట్‌హౌస్‌కు సంబంధించి ఎటువంటి నోటీసులు రాలేదని, అధికారులు నోటీసు ఇస్తే వెంటనే కూల్చి వేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. తన గెస్ట్‌హౌస్ గురించి పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడారని మండిపడ్డారు.
"ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో నాకెలాంటి అక్రమ కట్టడాలు లేవు. అది మా పట్టాభూమి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గెస్ట్‌హౌస్ నిర్మించాను. హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వానికి సహకరించి గెస్ట్‌హౌస్‌ను నేనే కూల్చివేస్తాను". - పట్నం మహేందర్‌రెడ్డి, మాజీమంత్రి