Ex Mp Rathod Ramesh Passed Away : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భౌతికకాయం ఇచ్చోడ నుంచి అంబులెన్స్‌లో ఉట్నూరుకు తరలించారు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి.
అంచెలంచెలుగా ఎదిగి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్, ఎంపీగా రాథోడ్ రమేశ్ గతంలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వ్యవహారించారు. 2009 లో టీడీపీ తరఫున ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన రమేశ్ రాథోడ్, తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. తర్వాత బీజేపీలో చేరి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం యత్నించగా, చివిరి నిమిషంలో బీజేపీ అధిష్ఠానం బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడం నగేశ్‌కు ఇచ్చింది.
అయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల మనిషిగా పేరొందిన రాథోడ్ రమేశ్ చివరికి కాలేయ సంబంధమైన వ్యాధితో పోరాడలేక తుదిశ్వాస వదలటం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓ క్రియశీలక నాయకుడిని కోల్పోయినట్లయింది. రాథోడ్ రమేశ్ మృతిపట్ల కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌లు సంతాపం తెలిపారు. బీజేపీ నేత లక్ష్మణ్ కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
"మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మృతి దిగ్భ్రాంతికరం, తీవ్ర విచారకరం. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ చాలా ఉత్సాహంగా పార్టీకోసం కష్టపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే రమేశ్ రాథోడ్ ఇకలేరనే వార్త బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను."- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
CM Revanth Condolences to Ex Mp Rathod Ramesh : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజకీయాల్లో రమేశ్ ప్రత్యేక ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రాథోడ్ రమేశ్ మృతి పట్ల లక్ష్మణ్ సంతాపం : మరోవైపు రాథోడ్ రమేశ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ కూడా సంతాపం తెలిపారు. 'మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ నాయకులు రాథోడ్ రమేశ్ నేడు గుండెపోటుతో ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, శాసన సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పనిచేసిన వ్యక్తి. ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి. వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి. వారి మరణం షెడ్యూల్ తరగతి వారికి, ఆదిలాబాద్ ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. రమేశ్ రాథోడ్ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.