Animals suffering from Lack Of water : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దీంతో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. దీంతో పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. దీంతో కొన్ని పులులు జనావాసాలకు వచ్చి ప్రజల భయబ్రాంతులకు గురుచేస్తున్నాయి.
నీటి కొరత అధిగమించేందుకు అన్ని చర్యలు : ఈ పరిస్థితిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. అడవుల్లో ఏర్పాటు చేసిన సాసర్ పిట్లలో ట్యాంకర్లతో, సోలార్ బోర్లతో కుంటల్లో నీళ్లు నింపడం వంటి చర్యలు చేపట్టింది. ఎండిన వాగుల్లోని ఇసుకను అటవీ సిబ్బంది తవ్వి నీటి చెలమలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మృగవని జాతీయ ఉద్యానవనం (చిలుకూరు అభయారణ్యం)లో పనిచేయని సోలార్ బోరుకు మరమ్మతులు చేయిస్తున్నారు. వన్య ప్రాణులకు నీటి వసతి కల్పించిన ప్రాంతాల్లో వేటగాళ్ల ఉచ్చులకు అటవీ జంతువులు బలికాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
కుమురం భీం జిల్లాలో మహారాష్ట్ర పులి - ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్న అటవీ ప్రాంతవాసులు
మారుతున్న ఆవాసాలు : రాష్ట్రంలో రెండు టైగర్ రిజర్వులు, 12 వైల్డ్‌లైఫ్ శాంక్చరీలు, 3 జాతీయ ఉద్యానవనాలున్నాయి. వన్యప్రాణుల సంచారం ప్రధానంగా వీటిలోనే ఉంది. నీటి వనరులు అడుగంటడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వు, కాగజ్‌నగర్ కారిడార్‌లో కెమెరా ట్రాపింగ్‌లో పులులు అంతగా కనిపించడం లేదని తెలుస్తోంది. అమ్రాబాద్ అడవుల్లో కొన్ని పులులు కృష్ణా నదిని దాటి ఏపీ వైపు వెళ్లాయా? అని అధికారులు ఆరా తీస్తున్నారు.
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు కాగా, అందులో అటవీ ప్రాంతం 66.64 లక్షల ఎకరాలు. ఇందులో చిక్కటి అడవి 33.94 శాతమే ఉంది. కార్చిచ్చులతో మట్టి నాణ్యత తగ్గుతోంది. దీంతో అడవుల్లో వర్షపు నీరు ఇంకే సామర్థ్యం తగ్గి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఫలితంగా ఉపరితల జలవనరులు త్వరగా ఎండిపోతున్నాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
అడవుల్లో నీటి కొరతను అధిగమించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎండిన వాగుల్లో నీటి చెలమలు తవ్వడం ఫలితాలనిస్తోంది. దగ్గరలోని గ్రామ పంచాయతీల ట్యాంకర్లనూ తీసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నాం. సాసర్‌పిట్లను మూడు, నాలుగు రోజులకోసారి నింపుతున్నాం. - ఎం.సి.ఫర్గెయిన్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్)
రెండు కూనలకు జన్మనిచ్చిన తెల్ల పులి- 4 నెలలు రహస్యంగా ఉంచిన అధికారులు!
కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతం