Anna Canteens Food Supply Contract to Akshaya Patra Foundation : అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ప్రమాణాలతో ఆహారం అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఆ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించే అవకాశాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ హరేకృష్ణ హరేరామ మూమెంట్‌కు అప్పగించారు. వీరు ఇప్పటికే అత్యుత్తమ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథక ఆహారం అందిస్తున్నారు. ఇదే అనుభవంతో అన్న క్యాంటీన్లకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న వంటశాల నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 38 అన్న క్యాంటీన్లకు భోజనం పంపిస్తున్నారు.
అన్న క్యాంటీన్లకు సంబంధించి సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార పట్టిక రూపొందించింది. ఈ పట్టిక ప్రకారమే అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం తయారు చేస్తుంది. అల్పాహారం కింద ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్, కుర్మాను క్యాంటీన్లకు అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు. ఒక్కో క్యాంటీన్‌కు అల్పాహారం 350 పేట్లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 350 ప్లేట్ల చొప్పున సరఫరా చేయాలి. మెుత్తంగా రోజుకు దాదాపు 40 వేల మందికి శుచికరమైన భోజనాలు సిద్ధం చేస్తారు.
ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనలు పాటించే వ్యాపారుల నుంచే నాణ్యమైన ముడిసరకులు కొనుగోలు చేస్తారు. సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ విధానం ప్రకారం పనిచేసే అధునాతన మిషన్లు వినియోగించి ఆహారం తయారు చేస్తున్నారు. అన్నం ఉడకడం నుంచి వాటిని పాత్రల్లో నింపడం, కూరగాయలు తరగడం ఇలా ప్రక్రియ మొత్తం మిషన్ల సాయంతోనే సాగుతోంది. రుచికి ప్రాధాన్యత ఇచ్చేలా స్టెయిల్ లెస్ స్టీల్ పాత్రల్లో వంటకాలను తయారు చేయడం అక్షయపాత్ర వంటశాలల ప్రత్యేకత. క్యాంటీన్లన్నింటికీ ఆహారాన్ని సరఫరా చేసేందుకు నిర్వాహకులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తారో వినండి.
మూడుపూటలా రుచికరమైన వేడివేడి భోజనం పెట్టడం పట్ల అన్నార్తుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇంటి భోజనం చేసినంత హాయిగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరి, గుడివాడ, ఏలూరు ప్రాంతాల్లో అక్షయపాత్ర వంటశాలలు ఉన్నాయి. త్వరలోనే ఇతర ప్రాంతాల్లోనూ వంటశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు రుచికరమైన భోజనం అందించటమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2వేల 500 మందికి ఉపాధి లభిస్తుందని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాల నిర్వాహకులు చెబుతున్నారు.
పాత ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం : మంత్రి నారాయణ - Minister Narayana On Anna Canteen