Grill 9 restaurant Seize In Nirmal : మండీ బిర్యానీలో ఇష్టంగా తినే మయోనైజ్ తయారీలో నాణ్యత పాటించకపోవడం వల్ల ఇటీవల చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవలే కలుషితమైన మయోనైజ్ తిని ఒకరు చనిపోగా 50 మంది ఆసుపత్రిలో చేరారు. నగరంలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరగడంతో ప్రభుత్వం ఇటీవల మయోనైజ్‌పై ఏడాది కాలం నిషేధం విధించింది. అయినా రెస్టారెంట్లు సర్కార్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. చాలా రెస్టారెంట్లలో మయోనైజ్‌ను ఇంకా వాడుతూనే ఉన్నారు. కస్టమర్లు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడటం లేదు. ఇలాగే నాణ్యతలేని మయోనైజ్ తిని నిర్మల్ పట్టణంలో ఒకరు చనిపోగా, 20 మంది ఆసుపత్రి పాలయ్యారు.
అసలేం జరిగిందంటే : నిర్మల్ పట్టణంలోని గ్రిల్ 9 రెస్టారెంట్లో ఈనెల 2 పలువురు కస్టమర్లు బిర్యానీ తిన్నారు. తరువాత వీరిలో 20మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు బోథ్‌కు చెందిన ఓ మహిళ ఇదే రెస్టారెంట్లో తిన్న తరువాత ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. పలువురు ఆసుపత్రిలో చేరాలన్న సమాచారంతో నిర్వాహకులు సోమవారమే రెస్టారెంట్ మూసేశారు.
అదే రోజు రెస్టారెంట్‌లోని సీసీ ఫుటేజ్ తీసుకెళ్లి ఆధారాలు లేకుండా చేశారు. విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను పట్టుకున్నారు. ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు.. పోలీసులు, నిందితుల సమక్షంలో రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. ఏమాత్రం పరిశుభ్రంగా లేని కిచెన్, జిడ్డుకారుతున్న వంట పాత్రలు, పడేపడే వాడుతున్న ఆయిల్, ఎక్స్పైర్ అయిన సరుకులను గుర్తించారు. తరువాత మున్సిపల్ అధికారులతో కలిసి ఇంఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.
"హోటల్ నిర్వాహకులకు మయోనైజ్ వాడకూడదని సూచించినప్పటికీ వారు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులు మయోనైజ్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. బాధ్యులపై కేసు నమోదు చేశాం "- ప్రత్యూష, ఫుడ్ ఇన్స్పెక్టర్
హోటల్ నిర్వాహకుడిపై కేసు : హోటల్లోని కాలం చెల్లిన సరుకులు, ఇతర ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఇంఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. బిర్యానీ, షవర్మాలో మయోనైజ్ తిన్న తరువాతే తాము అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పారని ఆమె చెప్పారు. గ్రిల్ 9 నిర్వాహకుల లైసెన్స్ కూడా రెన్యువల్ కాలేదని అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రాణాలు హరించేస్తున్న మయోనైజ్ : ఉడికించని పదార్థమైనందున మయోనైజ్‌లో హానికరమైన బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. చట్నీగా ఉపయోగించే మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నూనె, ఉప్పు, నిమ్మరసం, తయారు చేస్తారు. తయారు చేసిన వెంటనే వడ్డించకుండా నిల్వ ఉంచి తింటే అనారోగ్యం పాలవడం గ్యారెంటీ.
టేస్టీగా, టెంప్టింగ్గా ఉందని బయట తింటున్నారా? - ఆ టేస్ట్ అంతా 'కల్తీ' అంట! జర చూస్కోండి మరి
బార్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో చికెన్ తింటున్నారా? - అది కుళ్లిన మాంసమని మీకు తెలుసా!