Flood Threat to Khammam District : ఖమ్మంలో గతేడాది వరదల అనుభవాలు బాధిత కాలనీల వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ముంచెత్తిన వరదలతో మహోగ్రరూపం దాల్చిన మున్నేరు వరద విలయానికి ముంపు ప్రాంతాలు గజగజా వణికాయి. మున్నేరు వరదల ధాటికి నగరంలోని వెంకటేశ్వర కాలనీ, బొక్కలగడ్డ, మంచికంటి నగర్, మోతీనగర్, పద్మావతి నగర్‌తో పాటు మరికొన్ని కాలనీలు రోజుల తరబడి వరద నీటిలోనే మగ్గాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు వరదల్లో మునిగి కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది.
గ్రామీణం మండలంలోని పలు ప్రాంతాలనూ వరద విలయం వెంటాడింది. వాస్తవానికి కొద్దిపాటి వర్షాలకే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ వరద గుప్పిట చిక్కుకుంటాయి. మున్నేరుకు కరకట్టల నిర్మాణంతో వరద కష్టాలు తీర్చాలని ప్రభుత్వం సంకల్పించింది. పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఈ సీజన్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉపశమన చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఉమ్మడి ఖమ్మంకు వరద కష్టాలు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లోనూ వరద కష్టాలు పొంచి ఉన్నాయి. వైరా పురపాలికలోని ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలు ఏటా వరద ముంపునకు గురవుతున్నాయి. ముంపు నివారణ కోసం ఇక్కడ కరకట్ట నిర్మించాలని 15ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ముందగుడు పడలేదు. మధిర పురపాలికలో అంబర్‌పేట పెద్ద చెరువు వరద పోటెత్తి 4 కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకుంటాయి. కొన్నేళ్ల క్రితమే మట్టికట్ట నిర్మించినా కాలక్రమేణా అది కనుమరుగైంది. సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్, రాజీవ్ కాలనీలను వరదలు ముంచెత్తుతాయి. కాలువలు పూడిక తీయకపోవడం వల్ల ఇక్కడ వరద కష్టాలు వెంటాడుతున్నాయి.
కొత్తగూడెం పట్టణంలోని రామవరం ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎస్సీబీనగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎస్సీ కాలనీలు ముంపునకు గురవుతాయి. ప్రశాంత్ నగర్, ప్రగతినగర్ కాలనీలను ఏళ్లుగా ముంపు సమస్య వెంటాడుతున్నా తాత్కాలికంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు తప్పితే శాశ్వత చర్యలు శూన్యం. ఇల్లందులోనూ ఇదే పరిస్థితి. మణుగూరు పట్టణం మధ్యలో ఉన్న కట్టువాగు, మొట్ల వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల చాలా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.
వరద నీరు గోదావరిలో కలవాల్సి ఉన్నా అందుకు తగ్గ చర్యలు లేకపోవడంతో కాలనీలను వరద ముంచెత్తుతోంది. ఏటా గోదావరి వరదలకు భద్రాచలం పట్టణంలోని సగానికి పైగా కాలనీలు చిగురుటాకులా వణికిపోతుంటాయి. వరదలు రావడం స్థానికులు బిక్కుబిక్కుమంటూ గూడు వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవడం ఏళ్లుగా తప్పడం లేదు. వర్షాకాలంలో వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో వేసవికాలంలోనే ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉన్నా బల్దియాల్లో అందుకు తగిన కార్యాచరణ కనిపించడం లేదు. వరద నీటిని తరలించేందుకు ప్రత్యామ్నాయంగా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాల్సి ఉంది.
వరదలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : ముంపు ప్రాంతాలను ముందే గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో కాల్వల పూడికతీత, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచడం, వరద నీరు తరలివెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో శాశ్వత చర్యలు, మరికొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ముంపు చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. నిధుల లేమి, అధికార యంత్రాంగం, పాలకవర్గాల్లో నిర్లిప్తత తమపాలిట శాపంగా మారుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా చెక్ డ్యామ్‌ల నిర్మాణం - వరద నీరుతో మునిగిపోతున్న పంట పొలాలు