Flood Water Reaches Medigadda : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితుల నేపథ్యంలో మొదటిసారిగా మేడిగడ్డ బ్యారేజీకి 3,84,400 క్యూసెక్కుల మేర ప్రవాహం చేరింది.
పెరిగిన వరద ఉద్ధృతి : గత ఏడాది అక్టోబర్ నెలలో మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిని, కుంగిపోవడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. బ్యారేజీ దెబ్బతిన్న సమయం నుంచి తొలిసారిగా భారీ వరద ప్రవాహం శనివారం నమోదైంది. గత కొద్ది రోజులుగా యాభై వేల క్యూసెక్కులలోపు ప్రవాహం ఉండగా శుక్రవారం ఉదయం 1,31,750 క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగింది.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు : శుక్రవారం సాయంత్రానికి ప్రవాహ ఉద్ధృతి 3,10,080 క్యూసెక్కులకు చేరుకోగా శనివారం ఉదయానికి 3,84,400కు చేరింది. మరింత వరద ప్రవాహం పెరగనుంది. బ్యారేజీలో నీటి నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 85 గేట్లు ఎత్తే ఉంచడంతో వచ్చిన వరద నీరు వచ్చినట్టుగా దిగువకు చేరుతోంది. ప్రస్తుతానికి నీటిని నిల్వ చేసే పరిస్థితులు లేవు. అన్నారం బ్యారేజీకి సైతం వరద ప్రవాహం పెరిగింది. పై నుంచి 12,500 క్యూసెక్కుల ప్రవాహం వస్తూండడంతో 66 గేట్లు ఎత్తి ఉండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు.
జలకళను సంతరించుకున్న త్రివేణి సంగమం : ఇటీవల కురిసిన వర్షాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవహం క్రమంగా పెరుగుతోంది. త్రివేణి సంగమం తీరం వద్ద 8.32 మీటర్లకు పైగా ఎత్తులో మెట్లపై నుంచి వరద కొనసాగుతుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల దెబ్బతిన్న ఇళ్లు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. మహాదేవపూర్, కాటారం, మహా ముత్తారం, మలహర్రావు, పలిమెల మండలాల్లో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల పంట నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహాదేవపూర్, కాటారం, మహా ముత్తారం, మలహర్రావు, పలిమెల, వందల ఎకరాల పత్తి, వరి పంటలు నీట మునిగాయి. అధికారులు స్పందించి నీట మునిగిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
మేడిగడ్డ 7వ బ్లాకులో కొత్త సమస్య! - తీరా అక్కడికి వెళ్లి చూస్తే? - NEW ISSUE IN MEDIGADDA BARRAGE