Amit Shah Video Morphing Case Update : అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ దిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దిల్లీ పోలీసులు నిందితులుగా చేర్చిన మన్న సతీష్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవద్దని దిల్లీ పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఐదుగురు నిందితులు అరెస్టు : మరోవైపు ఈ ఘటనలో హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్లో పని చేస్తున్న పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, పెట్టం నవీన్, ఆస్మా తస్లీమ్, కోయా గీతలను అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు సీపీయూలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు అంశాలను గుర్తించారు.
గత నెల 23న మెదక్‌లో అమిత్ షా మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు పెండ్యాల వంశీకృష్ణకు వాట్సాప్‌కి వచ్చింది. ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూపులకు అతను ఫార్వర్డ్ చేయడమే కాకుండా, కాంగ్రెస్ అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో కూడా అతడు పోస్ట్ చేశాడు. మిగిలిన వారు కూడా వారి వ్యక్తిగత ఎక్స్ ఖాతాల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో నిజం లేకపోవడంతో ట్విటర్ దానిని డిలీట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి సోమ, శుక్రవారం కోర్టులో హాజరు కావాలి : విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, ఐదుగురు నిందితులకు కోర్టు రూ.10వేలతో ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్‌పై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సహా ఐదుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలని లేని పక్షంలో సీఆర్పీసీ 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పీసీసీ లీగల్ సెల్ మాత్రం నాలుగు వారాల గడువు కోరింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల ఈ సమయం కోరుతున్నట్లు తెలిపింది.