Telangana Indiramma House Scheme : ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. సమగ్ర కుటుంబ సర్వే నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను ఎంపిక చేసేందుకు సర్వే చేపడుతున్నారు. దీనికిగాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా యాప్‌ను ఆవిష్కరించగా గ్రామపంచాయతీలు, పురపాలికలు, నగర పాలక సంస్థల్లో పని చేసే పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లకు యాప్ డౌన్‌లోడ్ చేసి యూజర్ ఐడీలు కేటాయిస్తున్నారు. దీని కోసం ఉద్యోగుల మెయిల్ ఐడీలు రూపొందించి లాగిన్లు ఇస్తున్నారు.
క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల దగ్గరకు వెళ్లి వివరాలను అప్పటికప్పుడే యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 45,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మూడు ఇళ్ల ఆకృతులను రూపొందించింది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం మంజూరు చేయనుంది.
ప్రజాపాలన సమయంలో మహిళల పేరు మీద దరఖాస్తులు తీసుకోగా వాటి ఆధారంగానే ఎంపిక చేస్తున్నారు. గిరిజనులు, పేదలు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్లను కేటాయించనున్నారు. అందులో భాగంగా అవసరమైన అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు కోసం వేలాదిగా దరఖాస్తు చేసుకున్నారు. వీటి ఆధారంగా సర్వే చేస్తున్నారు. అర్హులను సైతం ఇందులోనే తేల్చనున్నారు. గ్రామాల్లో కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు సర్వే చేపడతారు. ఒక కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 43 వేల మంది వివరాలు యాప్‌లో నమోదయి ఉన్నాయి. వీటిని డివిజన్ల వారీగా విభజించి వార్డు అధికారులకు అప్పగించారు. ఎక్కువ ఇళ్లు ఉంటే అదనంగా సర్వే సిబ్బందిని పెంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,07,398 ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయి.
పక్కా డాక్యుమెంట్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను నియమించి రాబోయే 20 రోజులలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులు దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. తొలి విడతలో స్థలమున్న వారికి పక్కాగా డాక్యుమెంట్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అటు దరఖాస్తుదారులు తమకు.. తప్పకుండా ప్రభుత్వం ఇళ్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు రాగా వాటిలో ప్రాధాన్యతను నిర్ణయించడం అధికారులకు కత్తిమీదసాములా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది.
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్ - 84 వేల ఇందిరమ్మ ఇళ్లు మీ కోసమే - కానీ ఆ ఒక్కటే సమస్య
గుడ్‌న్యూస్ - ఇందిరమ్మ ఇళ్ల కోసం 'యాప్' సిద్ధం - రేపటి నుంచే లబ్ధిదారుల ఎంపిక