Film Producers Will Meet Deputy CM Pawan Kalyan : తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్‌తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌తో పాటు అశ్వినీదత్, చినబాబు, నవీన్ రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్యలు తదితరులు పవన్ కల్యాణ్‌ను కలవనున్నారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలపనున్నారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్‌తో చర్చించనున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాడిసన్ బ్లూ, బే పార్కులో వాటాలను పెద్దలు కాజేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్(ఫిల్మ్ క్లబ్) పైనా వైసీపీ కన్ను పడిందని విమర్శించారు. సినీ పరిశ్రమతో సంబంధంలేని వ్యక్తుల చేతుల్లోకి క్లబ్ వెళ్లిందని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ జిల్లా భీమిలి మండలం గొల్లల తిమ్మాపురంలోని ఫిల్మ్‌క్లబ్‌లో సినీ నిర్మాత, దీని పూర్వ అధ్యక్షుడు కేఎస్ రామారావు, నిర్మాత, నటుడు అశోక్‌కుమార్‌తో కలిసి శనివారం విలేకర్లతో మాట్లాడారు.
వైసీపీ పాలనలో గాడితప్పిన విశాఖ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు పూర్వ వైభవాన్ని తెస్తామని గంటా అన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సెంటర్‌కు మూడేళ్లలో శాశ్వత భవనాలను నిర్మిస్తామన్నారు. ఫిల్మ్‌క్లబ్ ఏర్పాటుకు టీడీపీ తోడ్పాటునిచ్చిందని గుర్తుచేశారు. తొట్లకొండపై 15 ఎకరాలు కేటాయించి భూమిపూజ కూడా చేశామని తెలిపారు. దీనిపై వివాదం రావడంతో 2019లో తిమ్మాపురం వద్ద రామానాయుడు స్టూడియో సమీపంలో ఐదెకరాలు కేటాయించామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు, నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం మారడంతో స్థలం వెనక్కి పోయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సినీ పరిశ్రమతో సంబంధంలేని వ్యక్తులు ఫిల్మ్‌క్లబ్‌లో ప్రవేశించారని తెలిపారు. జీవితకాల సభ్యులుగా బైలాలో నిబంధనలు మార్చేసి పెత్తనం చలాయించారని మండిపడ్డారు. చివరికి క్లబ్‌కు వైఎస్సార్ పేరు పెట్టేశారని గంటా ధ్వజమెత్తారు. అలాగే ఆంధ్రక్రికెట్ అసోసియేషన్, ఫిల్మ్‌క్లబ్‌లోని గత ప్రభుత్వ పెద్దలు తప్పుకోవాలన్నారు. ప్రస్తుతం 1,630 మంది సభ్యులుగా ఉన్నా రూ.38 కోట్ల నిధులే ఉన్నాయని, దీన్నిబట్టి చూస్తే వైసీపీకు చెందినవారంతా ఎలాంటి సభ్యత్వం రుసుం చెల్లించకుండానే ఇందులో పాగావేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు అర్థమవుతోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీలో అసక్తిగా పవన్ కల్యాణ్ తొలి స్పీచ్ - ఏం మాట్లాడారో తెలుసా? - AP Deputy CM Pawan Kalyan
తొలిరోజు సందడిగా శాసన సభ - చంద్రబాబు, పవన్, జగన్ ఎలా స్పందించారంటే? - AP Assembly Sessions 2024