Fight Between Snake And Mongoose : పాము - ముంగిస మధ్య జాతివైరం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు జంతువులు ఎదురుపడితే చాలు కొట్లాడకుండా ఉండవు. వాటి మధ్య ఉన్న వైరం అలాంటింది. ప్రత్యేకంగా వీటి మధ్య వైరం లేకపోయినా పాము ముంగిస ఆహారం కావడంతో ఈ పోరాటం మొదలవుతుంది. సాధారణంగా మనం పాములు చాలా వేగంగా స్పందిస్తాయని అనుకుంటాం కానీ ముంగిసలు పాముల కంటే వేగంగా స్పందిస్తాయి. అందుకే చాలా పోరాటాల్లో ముంగిసలదే పైచేయి అవుతుంది. కొన్ని సందర్భాల్లో పాములు తప్పించుకోవడం కూడా కనిపిస్తుంది.
కనపించడమే ఆలస్యం : ఇంతకీ ఈ స్టోరీ అంతా ఎందుకంటే ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటిగూడలో జరిగింది. రోటిగూడలో రహదారిపై పడగ విప్పిన నాగుపామును చూసి వాహనదారులు తమ వాహనాలను నిలిపేసి భయంతో చూస్తూ ఆగిపోయారు. ఇదే సమయంలో పాముకు ఎదురుగా ఓ ముంగిస వచ్చింది. ఇంకే ముందు ఎదురుగా పాము పడగ విప్పి మరీ కనిపించేసరికి ముంగిస పోరుకు సిద్ధమైంది. రెండు జంతువుల మధ్య కొన్ని సెకన్ల పాటు ఫైట్ జరిగింది.
ఈ పోరాటంలో ముంగిసదే పైచేయిగా కనిపించింది. ఓ దశలో పాము తప్పించుకునేందుకు ప్రయత్నించినా ముంగిస వదల్లేదు. చివరకు ముంగిస బలం, నేర్పు, వేగం ముందు పాము నిలవలేకపోయింది. ముంగిస పామును చంపి నోట్లో కరుచుకొని పొదల్లోకి వెళ్లింది. ఈ అరుదైన ఘటనను గ్రామస్తులు, వాహనదారులు తన సెల్ఫోన్లలో వీడియో తీయడంతో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.