Female Devotee Stuck Whole Night at Temple : ఆలయ సిబ్బంది ఓ మహిళా భక్తురాలిని ఆలయంలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె రాత్రంతా ఒంటరిగా ఆలయంలోనే చిక్కుకుపోయింది. ఈ విచిత్రమైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు ఒంటరిగా రాత్రంతా ఆలయంలోనే గడిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చెక్కల కింద దివ్యాంగ మహిళ : సోమల మండలానికి చెందిన ఓ దివ్యాంగ భక్తురాలు(60) మంగళవారం బోయకొండ గంగమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు. అయితే ఆలయ సిబ్బంది ఆమెను గమనించకుండానే రాత్రి ఆలయం తలుపులు మూసి తాళం వేశారు. దీంతో ఆ మహిళ ఆలయంలోనే రాత్రంతా ఒంటరిగా ఉన్నారు. బుధవారం ఉదయం అక్కడే పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందిలో ఒక మహిళ గుర్తించింది.
భక్తుల దర్శనార్థం అమ్మవారు కనిపించడానికి క్యూలైన్లలో ఎత్తుగా ఏర్పాటు చేసిన చెక్కల కింద ఆ దివ్యాంగ మహిళా ఉన్నట్లు కనుగొంది. వెంటనే ఆమె ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం సిబ్బంది సాయంతో చెక్కల కింద ఉన్న మహిళ భక్తురాలిని బయటకు తీశారు. ఈ విషయం ఆలయ ఈవో ఏకాంబరం దగ్గరకు వెళ్లడంతో సదరు మహిళ చిరునామా తెలుసుకొని ఆమెను ఇంటికి పంపించేశారు.
తిరుమల భక్తులకు అలర్ట్ - ఆ దర్శనాలు రద్దు
ఆలయ సిబ్బందిపై విమర్శలు : అయితే ఆలయ సిబ్బంది వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఆలయానికి తాళం వేసిన సిబ్బంది, అర్చకులు అసలు ఎంతవరకు బాధ్యతగా ఉండి ఆలయాన్ని పరిశీలించారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది అసలు ఆలయంలో నలుమూలలా పరిశీలించారా? లేక చూశామా? వచ్చామా? అనే దోరణిలో ఉన్నారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే విషయంపై ఆలయ ఈవో ఏకాంబరాన్ని వివరణ కోరగా మహిళ ఉన్న విషయం వాస్తవమేనని తెలిపారు. ఆలయంలోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే చెక్కల కింద దివ్యాంగురాలు ఉన్నట్లు చెప్పారు. ఆలయంలో రాత్రిపూట నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి అపరాధ రుసుం విధించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వివరించారు.
శ్రీశైలంలో పురాతన రాగి రేకులు, బంగారునాణేలు - చరిత్రకు ఆధారాలు
కాకులు వాలని శివయ్య కొండ- పెళ్లిళ్లు జరగని ఆలయం- ఎక్కడ ఉందో తెలుసా?