Fedex Scams in Telangana : సైబర్ కేటుగాళ్లు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 177 రోజుల వ్యవధిలో 592 మంది నుంచి రూ.44కోట్ల 25 లక్షల 93 వేల 497లు కొట్టేశారంటే మాయగాళ్లు ఎంతగా తెగించారో అర్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తికి ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఫోన్‌కాల్ వచ్చింది. సీబీఐ, ఈడీ పేర్లు చెప్పి ఇల్లు కదలనీయకుండా చేశారు. రోజుల వ్యవధిలో బాధితుడి నుంచి రూ.3కోట్ల 5 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. అతడు తేరుకొని మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగానే. 40లక్షల సొమ్ము అధికారులు ఫ్రీజ్ చేయగలిగారు. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే పూర్తి సొమ్ము రికవరీ చేయవచ్చని చెబుతున్నారు.
కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఫెడెక్స్ సైబర్ నేరాలకు సూత్రధారులు చైనీయులు. వివిధ దేశాలకు చెందిన యువతను టెలీకాలర్స్‌గా నియమించుకొని ఈ దందా సాగిస్తున్నారు. గతంలో సైబర్ నేరస్థులు తమ చేతికి అందిన మొబైల్ నెంబర్ల ఆధారంగా ఫోన్ చేసేవారు. అక్కడ సరైన గిట్టుబాటు లేదనే ఉద్దేశంతో రూటు మార్చారు.
వారే టార్గెట్ : డార్క్‌వెబ్‌సైట్, డేటా చోరుల నుంచి అడ్డదారిలో ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలను ఈ ముఠాలు కొనుగోలు చేస్తున్నాయి. బ్యాంకులో రూ.10 నుంచి 25లక్షలు నగదు నిల్వలున్న ఖాతాదారులను గుర్తించి వారికే పార్శిల్ పేరిట ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. వీరిలో అధికశాతం మందికి సైబర్ నేరాలపై అవగాహన లేకపోవటంతో కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు వినగానే వణకిపోతున్నారు. ఈ కేసుల్లో కుటుంబసభ్యుల పేర్లు కూడా చేర్చుతామనేగా బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలనే ఆందోళనలో అడిగినంత సొమ్ము జమ చేస్తున్నారు.
సెట్ వేసి మరీ బ్లాక్‌మెయిల్ : దుండగులు ఫోన్‌లో చెబుతుతున్న ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంటి చిరునామా, కుటుంబసభ్యులు, బ్యాంకు లావాదేవీలు సరిపోతున్నాయి. వీడియోకాల్స్ చేసి సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ, కస్టమ్స్ కార్యాలయాల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తున్నారు. కార్యాలయాల గోడలపై కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలు, యూనిఫామ్ ధరించిన టెలీకాలర్స్ కనిపించటంతో బాధితులు ఇట్టే నమ్మేస్తున్నారు.
"ఫెడెక్స్ పార్సిల్ ద్వారా మాదకద్రవ్యాలు, ల్యాప్‌టాప్‌లు, పాస్‌పోర్టులు డెలవరీ అవుతున్నాయి. ఎన్‌సీబీ అధికారులకు మేము దీన్ని అందిస్తున్నాం. అంటూ ఒక స్కైప్ ఐడీ ఇచ్చి దానికి రావాలి అంటారు. అప్పుడు 'ఇది హై లెవెల్ స్కామ్ మీరు మాకు తెలియకుండా ఎలాంటి స్కామ్ చేయడానికి లేదు. మీరు ఎక్కడికి వెళ్లకూడదు మా కళ్ల ముందే ఉండాలి' అని అంటారు. లేట్ నైట్స్ వరకు వాళ్లను కాల్‌లోనే ఉంచుతారు. బాధితులను భయానికి గురిచేస్తుంటారు. అలా వాళ్ల అకౌంట్‌లో ఎంత నగదు ఉందో తెలుసుకుని వాళ్ల ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటారు." - కేవీఎం ప్రసాద్, డీఎస్పీ
బాధితులను డిజిటల్ అరెస్ట్ : విచారణ పూర్తయేంత వరకూ ఇల్లు కదలకూడదని ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు అయోమయానికి గురిచేస్తున్నారు. పోలీస్, బ్యాంకు, బయటి వ్యక్తులకు ఫోన్ చేయాలన్నా తమ అనుమతి ఉండాలని నిబంధన విధిస్తున్నారు. తమ ఆదేశాలను దిక్కరిస్తే కుటుంబాన్ని అరెస్ట్ చేసి దిల్లీ/ముంబయి జైళ్లలో వేస్తామని బెదిరిస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు సహకరిస్తామంటూ వేర్వేరు విభాగాల అధికారుల పేరిట ఫోన్లు చేసి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేయించుకుంటున్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకూ ఫెడెక్స్ మోసాలలో పోగొట్టుకున్న రూ.44 కోట్ల 25 లక్షల 93వేల 497 సొత్తులో రూ.8కోట్ల70 లక్షల 53 వేల766 రూపాయలను ఫ్రీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. మనీ లాండరింగ్, డ్రగ్స్ వచ్చాయని ఫోన్‌కాల్ రాగానే కంగారుపడొద్దని గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేర్లతో వచ్చే ఫోన్లకు స్పందించవద్దని పోలీసులు చెబుతున్నారు. ఫెడెక్స్ పేరుతో చెప్పిన వివరాలన్నీ ఖచ్చితంగా ఉన్నట్టు భావించినా భయాందోళనకు గురికావొద్దు సూచిస్తున్నారు.
ఫెడెక్స్ స్కామ్‌లో వృద్ధుడికి రూ.50లక్షలు టోకరా - కేసు ఛేదించి తిరిగి చెల్లించిన పోలీసులు