Dhanurmasa Vratam Procedure In Telugu : ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. ధనుర్మాసంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువును మధుసూధనుడు పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం నివేదించాలి.
మార్గళి వ్రతం
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో రోజూ శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పించే మహిళలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది.
తిరుప్పావై విశిష్టత
గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. 'తిరు' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం.
ముప్పై రోజులు ముప్పై పాశురాలు
తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను పాడాలి. నిత్యం స్వామివారికి పొంగల్ నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా మహిళలలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటి రోజు ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగి రోజు ఆండాళ్- శ్రీ రంగనాథుల కల్యాణం జరిపించడం వల్ల ఈ వ్రతం ముగుస్తుంది.
ఆళ్వారులు అంటే!
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగితేలే వారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండు మంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన తన కుమార్తె గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు.
భూదేవియే ఆండాళ్
నిజానికి భూదేవినే ఆండాళ్గా జన్మించిందని చెబుతారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికిన విధంగా, శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తుడు తులసి వనం సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికిందంటారు. భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవినే ఆండాళ్ అని అంటారు. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
డిసెంబర్ 16వ తేదీ నుంచి ఆలయాలలో తిరుప్పావై ప్రారంభం కానున్న నేపథ్యంలో మనం కూడా పరమ పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై ఆచరిద్దాం ఆధ్యాత్మిక అనుభూతిని పొందుదాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.