Farmer Land Documents Issue In Warangal : వరంగల్ జిల్లాలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆ వ్యవసాయ భూమిని వేరొకరికి బదిలీ చేశారు. ఇప్పుడు పర్వతగిరి మండలం వడ్ల కొండలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. నేను బతికే ఉన్నాను మొర్రో అంటూ ఆ రైతు రోడెక్కాడు. తన భూమి వేరొకరి పేరుపైకి ఎలా నమోదవుతుందని పోరాటం చేస్తున్నాడు. ఇందులో అధికారులు, మధ్యవర్తుల పాత్ర కీలకమని ఆరోపిస్తున్నాడు.
వంశపారంపర్యంగా వస్తున్న భూమి తన తర్వాత తన సంతానం అనుభవిస్తున్నారని ఆ రైతు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది మరోలా ఉంది. అధికారులు, మధ్యవర్తుల చేతివాటంతో ఆ రైతు భూమిని మరొకరి పేరిట నమోదు చేసారు. తన భూమి తనకు దక్కకుండా పోతుందని అన్నదాత ఆందోళన బాటపడ్డాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండకి చెందిన ఎర్రం మల్లయ్య తన పేరిట ఉన్న ఎకరం 25 గుంటల వ్యవసాయభూమిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన రుణమాఫీ డబ్బులు వర్తించకపోవడంతో బ్యాంకు అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. బతికుండగానే చనిపోయాడని చెప్పి దళారుల సహాయంతో తన భూమిని వేరే వ్యక్తుల పేరుపైకి ఎలా మార్చుతారంటూ అధికారుల తీరుపై ఆ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి పేరుపై ఉన్న భూమి ఇతరుల పేరిట ఎలా మారిందని మల్లయ్య కుమారుడు పూర్తి వివరాలు సేకరించాడు. డబ్బుపై ఆశతో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు కోరారు.
విరాసత్ కింద భూమి మ్యుటేషన్ జరిగినట్లు గుర్తించినట్లు తహసీల్దార్ వివరించారు. భూ మార్పిడి జరిగిన ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు మల్లయ్య పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"బతికుండగానే చనిపోయాడని చెప్పి దళారుల సహాయంతో తన భూమిని వేరే వ్యక్తుల పేరు పైకి మార్చారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ భూమి మాపై ఉంది. ఎకరం 25 గుంటల వ్యవసాయ భూమిపై బ్యాంకులో అప్పట్లో రుణం తీసుకున్నాను. అవి మాఫీ కాకపోవడంతో చూసుకుంటే వేరే వారిపై భూమి ఉంది. ఈ భూమిపై ఆధారపడి బతుకుతున్నాము. అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇప్పించాలి." -మల్లయ్య బాధితుడు
మొక్క మొలిచింది మొదలు - పూతపూసి కాయ కాసే కడవరకు - పంటంతా ఎరువులమయం! - Chemical Fertilizers in Crops