Farmers about Crops Dried Up In Nalgonda District : వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు బోరులో నీళ్లు లేక చివరి దశలో పంట ఎండిపోయి చివరకు రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావులు ఆధారంగా వేలాది ఎకరాల్లో సేద్యం చేసే చిన్న సన్నకారు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు బావులు ఒట్టిపోయి చుక్క నీరు లేక చేతికందే పంట నిలువునా ఎండి రైతులకు కన్నీరు మిగులుస్తోంది. ప్రధానంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి మరింత దైన్యంగా మారింది.
Farmers Demand Compensation For Crops Dried up : కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ నీరు తరలించారని రైతులు చెప్పారు. ఆ క్రమంలో నల్గొండ జిల్లా సాగర్ ఆయకట్టు మేజర్లకు కూడా నీటిని విడుదల చేస్తే, భూగర్భ జలాలు పెరిగి తమ పంటలు చేతికి వచ్చేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు రాక, చేతికందని వరి పైరును చూస్తూ యాద్గార్‌పల్లిలో కూడా పలువురు రైతులు ఎండిపోయిన తమ పంటలను తగలబెట్టి తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకునే దుస్థితిలో ఉన్న రైతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నల్గొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ మండలంలో ఎండిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులతో సర్వే జరిపి ఎండిపోయిన ప్రతి ఎకరాకు 20 వేల రూపాయల చొప్పున రైతులకు నష్టపరిహారం అందించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను రాజకీయ కోణంతో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆదుకోవాలని కోరారు.
'కనీసం పది రోజులైనా నీళ్లు విడుదల చేస్తే పంట నష్టపోయే వాళ్లం కాదు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరానికి రూ. 30వేల ఖర్చు అయింది. కొంతమేరకు అయినా ప్రభుత్వం సహాయం చేస్తే రైతులు మేల్కొంటారు. బోర్లు ఎండిపోయి, నీళ్లు రాక పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.'- రైతులు
'మా పంటలకు సాగునీరు అందించండి మహాప్రభో'- మంథనిలో రైతుల ఆందోళన
నీరు లేక చివరి దశలో ఎండిపోతున్న పంటలు- కాపాడుకునేందుకు రైతుల నానాతంటాలు