Fake Passport Gang In Telangana : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నకిలీ పాస్‌పోర్టులు పొందిన వారికి సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయనున్నారు. విదేశాలకు చెందిన కొందరు నకీలీ పాస్ పోర్టులు పొంది ఇప్పటికే వేరే దేశాలకు వెళ్లగా మిగిలిపోయిన వారైనా దేశం దాటకుండా ఉండేందుకు సీఐడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోని అధికారులను అప్రమత్తం చేసి మిగిలిన వారు దేశం దాటకుండా నిఘా పెట్టింది.
CID Special Focus on Fake Passports : నకిలీ పత్రాలతో 92 మంది విదేశీయులు పాస్ పోర్ట్‌లు తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు వెల్లడించింది. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్‌నుమాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్‌పోర్టులను తీసుకున్నారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది.
'రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీలో పారదర్శకతను మరింత పెంచేందుకు కృషి'
"హైదరాబాద్, కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్‌లో ఏజెంట్లను ఏర్పాటు చేసి వారి ఫోన్ నంబర్లతో నిందితులకు పాస్‌పోర్టులు దరఖాస్తు చేయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశాం. తప్పుడు చిరునామాలు, నకిలీ ధ్రువీకరణపత్రాలు వినియోగించి పాస్‌పోర్ట్‌లను పొందిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వివరాలను ఇచ్చాం." - సీఐడీ అధికారులు
CID Investigation In Passport Issue Case With Fake Documents : ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ అల్ జవహరి విదేశీయులకు నీలోఫర్ ఆస్పత్రి పేరు మీద నకిలీ ఆధార్, పాన్‌కార్డులు, నకిలీ జనన ధ్రువపత్రాలను సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణంగా నిరక్షరాస్యులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే ఇమ్మిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్(ఈసీఎన్ఆర్) కేటగిరీ పాస్‌పోర్ట్ పొందాల్సి ఉంటుంది. ఈ తరహా పాస్‌పోర్ట్‌తో వెళ్తే తక్కువస్థాయి ఉద్యోగం మాత్రమే లభించే అవకాశముంటుంది. ఈనేపథ్యంలో ఈసీఎన్ఆర్ కేటగిరీని తప్పించుకునేందుకు నకిలీ పదో తరగతి మెమోలను ఈ ముఠా సృష్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారత పౌరులుగా విదేశీయులకు పాస్‌పోర్టులు - ముఠా గుట్టురట్టు చేసి కటకటాల్లోకి
CID Investigation In Passport Issue : ఈనేపథ్యంలో పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు లంచాలను ఇచ్చినట్లు సీఐడీ అనుమానిస్తోంది. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ పాస్ పోర్ట్ సేవా కేెంద్రాలలో ఏజెంట్లు స్లాట్ బుక్ చేసినట్లు గుర్తించారు. ఆయా కేంద్రాల్లోని అధికారులు ఎవరైనా నకిలీ పాస్ పోర్టుల జారీకి సహకరించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విచారణ క్రమంలోనూ లంచాలు ముట్టజెప్పి పాస్‌పోర్ట్ పొందినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.
ఫారిన్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ప్రయాణ బీమా మస్ట్! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!