Fake Currency Supplied Gang Arrest in Eluru : నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న ముఠా గుట్టును ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు త్రీ టౌన్, సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కె.రత్న శివ కిశోర్ మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరుకు చెందిన దొండపాటి ఫణి కుమార్ అనే వ్యక్తి 108 అంబులెన్స్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. గత నెల 28వ తేదీన ఒక వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద రూ.44 లక్షల నకిలీ కరెన్సీ ఉందని, తమకు రూ.10 లక్షలు ఇస్తే రూ.44 లక్షలు ఇస్తానని ఆశ చూపించారు.
తన వద్ద అంత డబ్బు లేదని చెప్పగా, ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వమని ఫణి కుమార్‌కు ఆ ముఠా సభ్యులు చెప్పారు. అనుకున్నట్లుగానే ఫణికుమార్ ఆ ముఠాకు రూ.3 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు కూడా రెడీ చేసుకోమని ఆ ముఠా సభ్యులు ఫణికుమార్‌కు చెప్పారు. ఈ విషయంపై ఫణికుమార్ తన స్నేహితులతో చెప్పడంతో ఇలాంటి వాటిని నమ్మకూడదని, మోసం చేస్తారని చెప్పారు. దీంతో వెంటనే ఫణి కుమార్ ఏలూరు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మిగిలిన డబ్బులు కూడా ఇస్తామని రప్పించి, ఎంతో చాకచక్యంగా దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
Fake Notes Found In SBI : SBIలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా RBIకే పంపిన బ్యాంకు అధికారులు
ఈ కేసులో నిందితులైన చింతలపూడి మల్లాయిగూడెంనకు చెందిన మారుమూడి మధుసూదనరావు, గప్పలవారి గూడెంనకు చెందిన కారు డ్రైవర్ బిరెల్లి రాంబాబును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల నుంచి రూ.44 లక్షల నకిలీ కరెన్సీ, రూ.3 లక్షల ఒరిజినల్ నోట్లను, ఓ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ ఈజీగా డబ్బులు వస్తాయని ఆశ చూపించి మోసం చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారని, అటువంటివారి మాటలను నమ్మవద్దని హితవు పలికారు. ఈ కేసులో ఫిర్యాదు అందుకున్న వెంటనే దర్యాప్తును పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయటంలో ప్రతిభ కనబరిచిన ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కాగిత శ్రీనివాసరావు, ఏలూరు సీసీఎస్ ఇన్స్పెక్టర్ సీహెచ్ మురళీకృష్ణ, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం - ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయించే ముఠా అరెస్ట్
Fake Currency Hyderabad : చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన నోట్లు చూశారా..?