Excise Department Activity on New Liquor Policy in AP : ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం మద్యం రేట్లను భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే వారికి, రాత్రి కొద్దిగా మద్యం తాగి అలసటను తీర్చుకునే అలవాటు ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం నిషేధం పేరుతో ధరలను విపరీతంగా పేంచేసి, నకిలీ బ్రాండ్లను దించేశారు.
దాంతో మద్యం ప్రియుల జేబులు గుల్ల కావడమే కాకుండా ఆరోగ్యమూ చెడిపోయింది. యువత కూడా గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోయారు. కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది.
తక్కువ ధరలో నాణ్యమైన మద్యం : కొత్త మద్యం పాలసీ, ప్రొక్యూర్‌మెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కార్యాచరణ చేపట్టింది. కొత్త మద్యం విధానంపై రెండు రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడి మద్యం విధానాల్ని అధ్యయనం చేశారు. ప్రముఖ లిక్కర్ కంపెనీలతో చర్చించారు.
అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. నూతన మద్యం పాలసీ రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90లోపే నిర్ధారించాలని సర్కార్ యోచిస్తోంది.
గంజాయి, మత్తు పదార్ధాలకు అలవాటు : తక్కువ ధర కేటగిరీలో జగన్ ప్రభుత్వం క్వార్టర్ బాటిల్‌ను 200 రూపాయలకు అమ్మకాలు జరిపింది. అప్పట్లో అధిక ధరలకు మద్యం కొనలేక యువత గంజాయి, ఇతర మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డారు. జగన్ ప్రభుత్వ విధానాల వల్లే గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం చెబుతోంది. రోజంతా వివిధ రకాల పనులు చేసుకునే పేదవారికి కూడా పెరిగిన ధరలతో చాలా కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి.
చాలా మంది మహిళలు తన భర్త సంపాదించే సొమ్ము అంతా తాగుడుకే ఖర్చు పెట్టేస్తున్నారని ఇళ్లు గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుతున్న నాటి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం-జనసేన-బీజేపీలు మద్యం ధరలు తగ్గించి, నాణ్యమైన లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.
వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు - త్వరలోనే అమలు - New Ration Cards in AP