Prashanth reddy Slams CM Revanth : రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజా పాలన అని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సమస్యల గురించి ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని, నిరసన తెలిపితే మార్షల్స్‌తో సభ నుంచి బయటకు పంపించారని ఆయన మండిపడ్డారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి తన వికృత రూపం బయటపడిందని, ప్రజలకు ఈ దౌర్భాగ్యం కలిగినందుకు తాను బాధ పడుతున్నట్లు తెలిపారు.
కౌరవుల సభలా సాగింది : శాసనసభ జరుగుతున్న తీరును చూసి కాంగ్రెస్‌తో స్నేహంగా ఉంటున్న అక్బరుద్దీన్ ఒవైసీ కూడా తప్పుపట్టారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సభా నాయకుడిలా కాకుండా ఆటవిక రాజ్యానికి రాజులా వ్యవహరించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సభ్యులు మంచిగా మాట్లాడుతున్న సందర్భంలో, రేవంత్ రెడ్డి తప్పుడు పత్రాలు తీసుకొచ్చి సభను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. గత ప్రభుత్వంపై ఏడుపు, కేసీఆర్‌ను తిట్టడం, కౌరవులలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉసిగొల్పడం తప్ప ఇంకోటి లేదని పేర్కొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు : కల్లుండి చూడలేని కబోదిలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణకు ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో గ్యారంటీల ఊసే లేకుండా పోయిందని, హామీల అమలు, బడ్జెట్లో నిధులు లేకుండా పోయాయని అడిగితే సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేశారని, సభను తప్పుదోవ పట్టించారన్నారు.
ఎక్కడైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా, దీనిపై మేధావులు స్పందించాలని, ప్రశాంత్‌రెడ్డి సూచించారు. విద్యుత్ మీటర్ల విషయంలో సీఎం సభను తప్పుదోవ పట్టించారని, ఇంత ఘోరమైన అబద్ధం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడరని ఆరోపించారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్‌రెడ్డికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు ఇవ్వాలని, ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధాలను ఆడటంలో రేవంత్ రెడ్డి పేరును గిన్నిస్ రికార్డులో చేర్చడానికి సిఫారసు చేస్తామన్నారు.
సీతారామ ప్రాజెక్టు కింద రూ. 75 కోట్లతో, 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటున్నారని, ఆయనకు కేంద్ర నీటిపారుదలశాఖ మంత్రి ఇవ్వాలని ప్రధాని మోదీకి సూచిస్తున్నాట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అబద్ధాల్లో భట్టి విక్రమార్కకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, చిల్లర వేషాలు వేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని వాడుకున్నారని మండిపడ్డారు.
"రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజా పాలన. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నేతలు ఎన్నో అబద్ధాలు చెప్పారు. అసలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. దీనిపై మేధావులు ఆలోచించాలి". - ప్రశాంత్‌రెడ్డి, మాజీమంత్రి