EX Minister Malla Reddy Land Dispute : హైదరాబాద్‌లోని సుచిత్ర పరిధి సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి మండిపడ్డారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Malla Reddy Argument With Police in Hyderabad : తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన అనుచరులతో పోలీసుల ముందే ఫెన్సింగ్‌ను కూల్చి వేయించారు. ఇంతలోనే ఘర్షణ జరుగుతున్న భూమి తమదేనంటూ 15 మంది ఘటనా స్థలికి వచ్చారు.
Malla Reddy Land Issue : 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది పోలీసులకు చెప్పారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఇరువురి వాదనలు విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం తమ భూమిపై కాంగ్రెస్ నాయకులు కొన్నేళ్లుగా కబ్జా చేయాలని చూస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఒకదశలో ఇరువర్గాల మధ్య గొడవ పెద్దదవుతున్న తరుణంలో పోలీసులు మల్లారెడ్డిని, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రప్రభుత్వం, పోలీసులు పూర్తిగా తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఆ భూమిని మార్వాడీ వద్ద నుంచి కొనుగోలు చేశామని దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నయని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా తమ భూమిలోకి ప్రవేశించి అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. దీనిపై అవతలి వర్గం వారం మాత్రం మంత్రి మల్లారెడ్డిది కేవలం ఎకరం 29 గుంటలు మాత్రమే ఉందని, మిగతాదంతా తమదేనని వారు వాదిస్తున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు.
అన్యాయంగా డిటైన్ చేశారని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల ధర్నా - మద్దతు తెలిపిన మైనంపల్లి