Harish Rao on Free Medical Diagnostic Centre : రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నోస్టిక్ హబ్‌లకు జబ్బు అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన సామాజిక మాధ్యమైన 'ఎక్స్'లో స్పందించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కేసీఆర్, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని హరీశ్‌రావు గుర్తు చేశారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు.
ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం : ప్రస్తుతం సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని, ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి 6 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించడంతో పాటు డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Harish rao on BRS Corporators Attack : మరోవైపు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. డీజీపీ, రాచకొండ కమిషనర్ వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడటం గర్హనీయమని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.