Ex Minister D Srinivas Final Funeral Completed : మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఫామ్‌హౌజ్‌లో ఘనంగా జరిగాయి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్‌లోని ప్రగతినగర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర, కంఠేశ్వర్, బైపాస్ రోడ్డు మీదుగా ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. అక్కడ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను ముందే చేసి ఉంచారు. ఈ అంతిమ యాత్రలో రాజకీయ పార్టీల నేతలు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నివాళి : అంతకు ముందు నిజామాబాద్‌లోని నివాసంలో శ్రీనివాస్ పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా డీఎస్ సేవలు అందించారని తెలిపారు. నిజామాబాద్ నుంచి బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించింది డీఎస్సే అని కొనియాడారు. కుటుంబ సభ్యుల ఆలోచనలతోనే డీఎస్‌ను గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంటులో డీఎస్‌ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారని తెలిపారు. డీఎస్ చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా తనపై కప్పాలనే ఆయన కోరికను నెరవేర్చడానికే కాంగ్రెస్ జెండాను ఆయనపై కప్పామని తెలిపారు. ఇలా ఆయన చివరి కోరికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి పంపించి నెరవేర్చామన్నారు.
గుండెపోటుతో డీఎస్ మృతి : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో డీఎస్ శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజకీయ పార్టీ నాయకులు, అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని నివాసంలో ఉంచారు. అనంతరం భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లో నిజామాబాద్‌లోని నివాసానికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం ఉంచి నేడు అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత- పలువురు నాయకుల సంతాపం - tributes to dharmapuri srinivas