Ex Employees Beaten Up in Hyderabad : పాత సంస్థలో ఉద్యోగం మానేసి కొత్త కంపెనీలో చేరడమే ఆ యువతీ,యువకులు చేసిన తప్పు. ఇలా చేరినందుకు శిక్షగా పాత సంస్థకు చెందిన నిర్వాహకులు వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఒక షెడ్డులో బంధించి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లిలో జరిగింది. ఈ దాడిలో ఐదుగురు యువకులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన హరిదీప్ రెడ్డి మేడిపల్లిలో లాంగ్‌డ్రైవ్(Long Drive Car Company) అనే కార్ల సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థలో నగరానికి చెందిన మధుమిత, రిషిత, సాయితరుణ్, నితిన్, వేణు, ఒబేద్, యోగి తదితరులు ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల వీరంతా కలిసి మరో సంస్థలో చేరారు. అయితే వీరికి సంస్థ యజమాని హరిదీప్ రెడ్డి ఒక నెల జీతం ఇవ్వాల్సి ఉంది.
ఇందుకు సంబంధించిన వేతనం కోసం వీరంతా కలిసి ఈనెల 12న లాంగ్ డ్రైవ్ కార్ల సంస్థ వద్దకు వెళ్లారు. అక్కడకు వెళ్లి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగారు. అయితే వారికి రావాల్సిన వేతనం ఇవ్వాల్సిందిపోయి, హరిదీప్ రెడ్డి, మహేశ్, శరత్‌కుమార్, పూజ, అనూష, కుమార్, రాజమహేశ్, రాజ్‌కుమార్, అలీమ్, హరిప్రసాద్, ముత్తేశ్వర్ తదితరులు ఈ ఏడుగురిని ఒక షెడ్డులో రహస్యంగా బంధించారు.
యువకుల దుస్తులు విప్పి చిత్రహింసలు : ఆ షెడ్డులో వీరందరిని బంధించి చితకబాదారు. తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు లీక్ చేస్తున్నారని దారుణంగా హింసించారు. యువకుల దుస్తులు విప్పించారు. ఆ తర్వాత వైర్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఈ దారుణం కొనసాగింది. ఆ ఏడుగురిలో ఉన్న ఇద్దరు యువతులపై అనుచితంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న బైకులు, సెల్ఫోన్లను లాక్కుని అక్కడి నుంచి పంపించేశారు.
అక్కడి నుంచి వెళ్లిపోయిన బాధితులు 12వ తేదీన మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేశారు. కానీ వైద్య పరీక్షల పేరుతోకేసు నమోదులో పోలీసులు కాలయాపన చేసి ఫిర్యాదును మార్చి మార్చి రాయించుకున్నారని బాధితులు వాపోయారు. చివరిగా కేసు నమోదులో జాప్యం జరిగిందని మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. వివిధ రాజకీయ, ప్రజా హక్కు సంఘాల ఆందోళనలతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారని బాధితులు తెలిపారు. నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు హరిదీప్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.
పూలు తెంపారని ముక్కు కోసేశాడు- ప్రాణాపాయ స్థితిలో అంగన్వాడీ హెల్పర్
నలుగురి పిల్లల తల్లితో యువకుడి ప్రేమాయణం- ఇంటికి పిలిచి ప్రైవేట్ భాగాలు కట్ చేసిన లవర్!