EX CM KCR Dasara Celebrations : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శనివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ వేడుకలు చేసుకున్నారు. కేటీఆర్, ఆయన సతీమణి శైలిమా, కుమార్తె అలేఖ్యలతో కలిసి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విదేశాల్లో ఉంటున్న మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. వేడుకల అనంతరం కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.
డిసెంబర్లో జనాల్లోకి! : కేసీఆర్ డిసెంబర్ నెలలో తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అప్పటికి కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి కానుండటంతో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తనను కలుస్తున్న నేతలకు ఆయన ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ అంశాలు, ప్రజల సమస్యలపై సమయం చూసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్న భావనతో ఉన్నట్లు సమాచారం.
అప్పటి నుంచి జనాల్లోకి రాని కేసీఆర్ : లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. శాసనసభ సమావేశాల సమయంలోనూ కేవలం బడ్జెట్ రోజు మాత్రమే హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకలాపాల్లోనూ ఆయన పెద్దగా పాల్గొనలేదు. బడ్జెట్ సమావేశాల సమయంలో తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఎలాంటి సమావేశాల్లో పాల్గొనలేదు. తనను కలిసేందుకు వచ్చిన నేతలతో సమావేశమై పార్టీ గురించి, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఆరా తీస్తూ వస్తున్నారు.
అయితే కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో రాజకీయ ప్రత్యర్థులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే అసెంబ్లీకి కూడా రావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ, భారీ వర్షాలు, వరదల సమయంలోనూ కేసీఆర్ బహిరంగంగా స్పందించలేదు. తనను కలిసిన నేతలతో రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, ప్రజల వివిధ సమస్యలు, నాయకుల ఫిరాయింపులు, తదితరాల గురించి కేసీఆర్ చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఆరా తీస్తూనే నేతలకు తగిన సూచనలు చేస్తున్నారు.
కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత : కేసీఆర్ మొదటి నుంచి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న భావనతోనే ఉన్నారు. ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పారు. డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది అవుతుంది. ఆ తర్వాత కేసీఆర్ ఓ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.