Padmavathi Ammavari Brahmotsavam Significance : తిరుమల శ్రీనివాసునికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగినట్లే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా ప్రతి ఏడాది కార్తిక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు కార్తిక మాసంలోనే ఎందుకు జరుగుతాయి? ఆ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
"పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్ఞ్యలాం భగవతీం పందే జగన్మాతరమ్!" అంటూ పద్మావతి భక్తులు స్తుతిస్తారు.
కార్తిక మాసంలో ఇందుకే బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి ఏటా కార్తిక మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అసలు ఈ బ్రహ్మోత్సవాలు కార్తిక మాసంలోనే ఎందుకు నిర్వహిస్తారంటే! శ్రీ పద్మావతీ అమ్మవారు కార్తిక మాసంలో శుక్లపక్షం, పంచమి తిథి, శుక్రవారం ఉత్తారాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఆమె జన్మ నక్షత్రం ఆధారంగా కార్తిక మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. మొదటిసారిగా బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది.
పద్మావతి వైభవం
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని వేంకటాచల మహత్యం లో వివరించిన ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి శ్రీ మహాలక్ష్మి దేవి స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంలో కాలితో తన్నడం వలన, కోపంతో లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీ వియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నది తీరాన తిరుచానూరు పద్మసరోవరంలో కార్తిక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూల దండలతో స్వామి వారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో పద్మావతిగా జన్మించినదని పురాణాల ద్వారా తెలుస్తోంది.
అలిమేలు మంగ పేరు ఇలా వచ్చింది
తమిళ భాషలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ అని అర్ధం. అలమేలుమంగై అంటే తామరపువ్వు లో జన్మించిన పద్మావతి అని అర్ధం.
వేదవతే పద్మావతి!
మరో కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు మాట ఇస్తాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతి గా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా మారినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసిందని వేంకటాచల మహత్యం ద్వారా మనకు తెలుస్తోంది. ఇంతటి విశిష్టమైన అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. కార్తిక మాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించడం సకల శుభప్రదం ఐశ్వర్య కారకం అని శాస్త్ర వచనం. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.