Karthika Puranam 25th Day In Telugu Pdf : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో కార్తిక పురాణ కాలక్షేపంలో భాగంగా మహా విష్ణు భక్తుడు, ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అత్రి అగస్త్యుల సంవాదం
అత్రి అగస్త్య మహామునుల సంవాదమును వివరిస్తూ వశిష్ఠులవారు జనకమహారాజుతో ఇరవై అయిదవ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు.
ఇరకాటంలో అంబరీషుడు
అంబరీషుని కథను అత్రి ముని అగస్త్యునితో ఇంకను ఈవిధముగా చెప్పసాగాడు. దూర్వాస మహర్షిని గురించి, ద్వాదశీ వ్రతమును గురించి పండితులు అంబరీషునికి వివరిస్తూ "ఓ అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. నీ వివేకముతో అలోచించి, నీకేది మంచిదని అనిపిస్తే అదే చేయుము. ఇక మాకు సెలవు ఇప్పించండి" అని పలికిరి.
జలం స్వీకరించిన అంబరీషుడు
Karthika Puranam 25th Chapter In Telugu : వెళ్లిపోతున్న పండితులతో అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నా అభిప్రాయము చెబుతాను ఆలకించండి. ద్వాదశి నిష్ఠను విడిచిపెట్టడంకన్నా, బ్రాహణుని శాపం పెద్దది కాదు. జల పానము చేయడం వలన బ్రాహ్మణుని అవమానపరచినట్లు కాదు. అంతేకాక ద్వాదశి ఉపవాసం కూడా విడిచి పెట్టినట్లవుతుంది. అప్పుడు దూర్వాసుడు కూడా నన్ను నిందించడు. నా పూర్వ పుణ్యము కూడా నశింపదు. కావున నేను నీటిని మాత్రము తాగి, భోజనము దూర్వాస మహర్షి వచ్చిన తర్వాత చేస్తాను" అని పండితుల సమక్షంలో జలమును స్వీకరించాడు.
దుర్వాసుని ఆగ్రహం
సరిగ్గా అంబరీషుడు జలమును స్వీకరిస్తున్న సమయంలోనే దూర్వాస మహర్షి నదీ స్నానం చేసి తిరిగివచ్చాడు. నీటిని తాగుతున్న అంబరీషుని చూసి దూర్వాసుడు ఆగ్రహముతో కళ్ల వెంట నిప్పులు కురుస్తుండగా "ఓరీ మదాంధుడా! నన్ను భోజనానికి రమ్మని పిలిచి నేను రాకుండానే నీవు తింటావా? నీకు ఎంత మదం? ఎంత అహంకారము? అతిథికి అన్నం పెడతానని ఆశ పెట్టి, అతిధి భోజనం చేయకుండానే భోజనము చేసినవాడు మలభక్షణ చేసినట్లే! అటువంటి నీచుడు మరుసటి జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలమును స్వీకరించావు. అది కూడా భోజనము తో సమానమే! నీవు ఒక్కనాటికి హరి భక్తుడవు కాలేవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపలేడు. నీవు మహా హరి భక్తుడవు అని విర్రవీగుచున్నావు. నీకిదే నా శాపము". అని శపించబోయాడు.
అంబరీషుని శపించిన దుర్వాసుడు
తనను శపించబోతున్న దుర్వాసుని చూసి అంబరీషుడు గడగడా వణుకుతూ "స్వామి! నేను ధర్మహీనుడను. నన్ను మన్నించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. శాంతించండి. నన్ను కాపాడండి" అని ఎన్నో విధములుగా వేడుకున్నప్పటికిని దూర్వాసుడు పట్టరాని ఆగ్రహముతో తన ఎడమకాలితో అంబరీషుని తన్ని, "ఓయీ పాపి! దోషికి శాపము ఇవ్వకుండా ఉండరాదు. కావున నీవు ఇక్కడ నుంచి రానున్న పది జన్మలలో అతి నీచమైన జన్మలెత్తుతావు. అవి ఏమనగా...
మొదటి జన్మలో... చేపగా
రెండవ జన్మలో ...తాబేలుగా
మూడవ జన్మలో...పందిగా
నాలుగవ జన్మలో...సింహముగా
ఐదవ జన్మలో...వామనుడుగా
ఆరవ జన్మలో....క్రూరుడగు బ్రాహ్మణుడుగా
ఏడవ జన్మలో....మూఢుడవైన రాజుగా
ఎనిమిదవ జన్మలో...రాజ్యము లేని రాజుగా
తొమ్మిదవ జన్మలో...పాషాండ మతస్తునిగా
పదవ జన్మలో.....దయలేని బ్రాహ్మణునిగా జన్మిస్తావు" అని ముందువెనక ఆలోచించకుండా శాపాన్నిచ్చాడు.
అంబరీషుని రక్షించిన శ్రీ మహావిష్ణువు
ఒకసారి శాపం ఇచ్చి కూడా దుర్వాసుడు ఇంకను కోపము తీరక మరల శపించబోగా, శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని, అదే సమయంలో తన భక్తుడైన అంబరీషునికి ఏ ఆపద రాకూడదని, అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! మీ శాపమును అనుభవిస్తాను"అని ప్రాధేయపడినా కూడా, దూర్వాసుడు ఇంకను ఆగని కోపముతో మరల శపించబోగా, ఆ సమయంలో చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును దూర్వాసుని శాపము అంబరీషునికి తగలకుండా అడ్డుపెట్టెను.
దుర్వాసుని వెంటాడిన సుదర్శన చక్రం
శ్రీ మహావిష్ణువు విడిచిన సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు వెదజల్లుతూ దూర్వాసుని పైకి దూసుకు వెళ్ళసాగింది. అప్పుడు దూర్వాసుడు ఆ సుదర్శన చక్రము తనను మసి చేస్తుందని భయపడి ప్రాణముపై ఆశతో అక్కడి నుంచి పరుగెత్తెను. మహా తేజస్సుతో సుదర్శన చక్రము కూడా మహర్షిని వెంబడించసాగెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న అందరు మునులను, దేవ లోకమునకు వెళ్లి ఇంద్రాది దేవతలను, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని, బ్రహ్మ లోకమునకు వెళ్లి బ్రహ్మను ఎంత ప్రార్ధించినను వారెవరు కూడా సుదర్శన చక్రమును ఎదిరించగల శక్తి తమకు లేదని తమ నిస్సహాయతను వెల్లడించారు. ఈ విధంగా అంబరీషుని కథను వివరిస్తున్న అగస్త్య అత్రి మహామునుల సంవాదమును వివరిస్తూ వశిష్ఠులవారు ఇరవై ఐదో రోజు కథను ముగించాడు. ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే! పంచవింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.