EX CM Jagan Fire on AP Govt : ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. రషీద్ కుటుంబసభ్యులను వివిధ నాటకీయ పరిణామాల నడుమ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పరామర్శించారు. జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో పోలీసులు భారీగా మోహరించారు. పరామర్శ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతి భద్రతలు బాగోలేవు : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వచ్చే బుధవారం దిల్లీలో ధర్నా చేస్తామని జగన్ చెప్పారు. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని, రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్లు అడుగుతున్నామని తెలిపారు. అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్రంలోని శాంతి భద్రతల గురించి వివరిస్తామని వెల్లడించారు.
హామీలన్నీ అమలు చేయాలని నిలదీస్తాం : విద్యా దీవెన, వసతి దీవెన ఫీజుల చెల్లింపు ఆలస్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అమ్మ ఒడి నిధులను ఏటా జూన్‌లో వేసే వాళ్లమని, అలాగే రైతు భరోసా నిధులను క్రమం తప్పకుండా వేసేవారిమని చెప్పారు. తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులను ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. మహిళలకు ఇస్తామన్న రూ.1500 హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల హామీ ఏమైందన్నారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ రెడ్డి తెలిపారు.
Jagan Fake Publicity : వినుకొండలో హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ తనకు కేటాయించిన వాహనం సౌకర్యంగా లేదని మార్గమధ్యలో వేరే కారులోకి మారి వెళ్లారు. అంతేకాకుండా ఫిట్‌గా లేని వాహనం జగన్‌కు ఇచ్చారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వాహనం పూర్తి ఫిట్ నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే వీఐపికి కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు జగన్ వ్యవహారశైలిని టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు.
శవ రాజకీయానికి వినుకొండ బయలుదేరిన జగన్ 5 నిమిషాలు కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చో లేకపోయాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కారులో చంద్రబాబు దాదాపు 10 ఏళ్లు ప్రయాణం చేశారని, ప్రతిపక్ష నేతగా, NSG భద్రతలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కొన్ని వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారని గుర్తు చేస్తున్నారు. జగన్ చేసిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని చాటేందుకు ఏకధాటిగా వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారని, కానీ ఎక్కడా తనకు కంఫర్ట్‌గా లేదని, నా వాహనాలు మార్చండి అని చంద్రబాబు ఏనాడూ యాగీ చెయ్యలేదని అంటున్నారు. ప్రభుత్వం కక్ష కట్టిందని రాజకీయం చేయలేదని తెలిపారు.
ఏపీ మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు - CASE AGAINST AP EX CM JAGAN